టెన్నిస్ క్రీడాకారిణి భువన కేసులో కొత్త మలుపు
posted on Nov 2, 2015 8:40AM
టెన్నిస్ క్రీడాకారిణి భువన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె భర్త అభినవ్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ అతని అనుచరులు కలిసి దాడి చేసి భువనను కిడ్నాప్ చేయగా, అతను పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ తన భర్తే తన తండ్రి మహేంద్రనాద్ పై దాడి చేసారని భువన స్వయంగా చెప్పారు. తన కుమారుడు సాయి కిరణ్ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తన కుమారుడితో సహా మారేడ్ పల్లిలోని భువన ఇంటికి నిన్న వెళ్లి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి భువన చేతనే జరిగినదంతా మీడియాకు వివరింపజేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం ఇష్టపడే పెళ్లిచేసుకొన్నామని తెలిపారు. అభినవ్ కు ఇదివరకే వేరొకరితో పెళ్ళయిన సంగతి తెలిసుకొని తను మోసపోయానని చాలా బాధపడ్డానని తెలిపారు. అభినవ్ తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా రూ.3కోట్లు కట్నం కావాలని నిత్యం తనను మానసికంగా చాలా హింసించేవాడని భువన తెలిపారు. ఈ సంగతి తెలుసుకొని తనను తీసుకుపోవానికి తన తండ్రి మహేంద్రనాద్ తుకారం గేటు సమీపంలో ఉన్న తమ ఇంటికి వచ్చినప్పుడు అభినవ్ తన తండ్రిపై దాడి చేసాడని భువన తెలిపారు. తన తండ్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయం కోరి ఆయన ఇంటికి వెళ్ళగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు సాయి కిరణ్ తక్షణమే స్పందించి తనను కాపాడి తన తల్లి తండ్రులకు అప్పగించారని తెలిపారు. ఇకపై తను అభినవ్ తో కలిసి జీవించలేనని భువన మీడియాకు తెలిపారు.
ఆమె బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్త అభినవ్ పై పిర్యాదు చేయగా వారు అతనిపై 498(ఏ), 495 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ “మహేంద్రనాద్ గారు మా ఇంటికి వచ్చినపుడు నేను ఇంట్లో లేకపోవడంతో నా కుమారుడు సాయి కిరణ్ మానవతా దృక్పదంతో స్పందించి భువనను రక్షించి తీసుకువచ్చి ఆమె తల్లి తండ్రులకి అప్పగించాడు తప్ప అతనేమీ ఎవరినీ కిడ్నాప్ చేయలేదు. కిడ్నాపులు చేయడానికి నా కుమారుడు ఏమీ డాన్ కాడు. మీడియాలో కొన్ని సంస్థలు పనికట్టుకొని నామీద బురద జల్లుతూ తద్వారా మా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అటువంటి వారు హోటల్స్ లో తప్పతాగి అల్లరి చేస్తున్నపుడు వారిని కూడా నేను రక్షించిన సందర్భాలున్నాయి. ఆ సంగతి మరిచిపోయి తిరిగి నాపైనే ఈవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు,” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.