హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కాకతీయ అనవాళ్లు పరిరక్షించుకోవాలి

ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి 

నార్సింగి మండలం, మంచిరేవులలో చాళుక్య, కాకతీయ అనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. టీ.జీ.ఎస్.పి ప్రాంగణానికి ఎడమవైపున, మూసీ నది కుడివైపున గల వీరభద్రాలయంలో యోని ఆకారంలో గల పానపట్టం, దాని పైనున్న శివలింగం క్రీ.శ 8వ శతాబ్ది చాళుక్యుల కాలానికి చెందిందని, ఆలయం వెలుపల ఉత్తరం వైపు గల భిన్నమైన వీరభద్రుని విగ్రహం క్రీ.శ 13వ శతాబ్ది కాకతీయుల కాలం నాటిదని అన్నారు. మచిరేవుల పరిసరాలలో చారిత్రక ఆనవాళ్లు గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం నాడు ఈ విగ్రహాలను పరిశీలించారు. ఆరు చేతులు గల వీరభద్రుడు కుడివైపున కత్తి, బాణము, ఢమరుకం, ఎడమ వైపున డాలు, విల్లు, శూలం ధరించి, శరీరం అన్ని ఆభరణాలతో అలంకరించబడి ఉందని, ఆలయ ప్రవేశ ద్వారం ముందు, అసంపూర్ణంగా చెక్కిన నంది శిల్పం కూడా కాకతీయుల కాలంనాటిదేనని శివనాగిరెడ్డి చెప్పారు.

చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను భద్రపరిచి, కాపాడుకోవాలని ఆలయ వంశ పారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వర్ గారికు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ శిల్పాల ద్వారా హైదరాబాద్ నగర శివారులోని మంచిరేవుల గ్రామ చరిత్ర చాళుక్యకాలం అంటే 1200 సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యదర్శి పాములపాటి శ్రీనాథ్ రెడ్డి, ఆలయ అర్చకులు మాడపాటి పరమేశ్వర్ పాల్గునారు.