నేడు నామినేషన్లు వేయనున్న కాంగ్రెస్, వామ పక్షాల అభ్యర్ధులు
posted on Nov 2, 2015 9:43AM
వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య మరియు వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ ఇద్దరూ కూడా ఇవ్వాళ తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అధికార తెరాస వసునూరి దయాకర్ పేరును ఖరారు చేసింది. ఆయన కూడా నేడోరేపో తన నామినేషన్ దాఖలు చేస్తారు.
ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీకి చెందిన వ్యక్తిని నిలబెట్టబోతున్నాయి. అయితే ఇంతవరకు బీజేపీ తన అభ్యర్ధి పేరుని ఖరారు చేసుకోలేకపోతోంది. ఇంతకు ముందు తెరాసలో పనిచేసిన చింతా స్వామి, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దేవయ్య, స్థానికంగా మంచి పేరున్న వైద్యుడు డాక్టర్ రాజమౌళి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈరోజు వారిలో ఎవరో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. వరంగల్ నుంచి పోటీ చేయడానికి తెదేపా తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినప్పటికీ, దానిని తమకే వదిలిపెట్టాలని బీజేపీ పట్టుబట్టి మరీ తీసుకొంది. కానీ ఎన్నికలలో విజయం సాధించడానికి తగినంత అర్ధబలం, అంగబలం ఉన్న అభ్యర్ధులు పార్టీలో లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది. అటువంటప్పుడు ఆ స్థానం తమకే వదిలిపెట్టి తమకే మద్దతు ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది కదా అని తెదేపా నేతలు అభిప్రాయ పడుతున్నారు.