అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ.. తిరుపతిలో ఉద్రిక్తత
posted on Dec 24, 2024 11:39AM
వైఎస్ జగన్ హయాంలో తిరుపతి, తిరుమలలో అన్యమత ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకు కొలువులు ఇచ్చారు. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా పలు ఘటనలు జరిగినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల పవిత్రతను కాపాడే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తిరుమల పవిత్రత, పారిశుద్ధం మెరుగుపరచడం వంటి చర్యలతో పాటుగా తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది.
అయితే గత ప్రభుత్వంలో అరాచకాలను ప్రోత్సహించిన ఫలితంగా ఆ అరాచక శక్తుల అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. తాజాగా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగింది. తిరుపతిలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టారు. దీంతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నమయ్య విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అన్నమాచార్యుడికి అపచారం చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.