తెలంగాణాలో కాంగ్రెస్ మళ్ళీ యాక్టివ్ అవుతోందా?

 

కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా రాష్ర్టం ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలలో పరాజయం పొందింది. ఆ తరువాత తెరాసలోకి పార్టీ నేతల వలసలతో కుదేలయింది. ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకొంటున్న సమయంలో ఊహించని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి తమ పోరాటపటిమని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

 

ఉస్మానియా విశ్వద్యాలయ భూములలో పేదలకు ఇళ్ళు కట్టించాలనే కేసీఆర్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదలుపెట్టిన పోరాటంతో వారు తెరాస ప్రభుత్వంపై మొట్టమొదటి విజయం సాధించారు. ఆ తరువాత మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేయాలనే కేసీఆర్ నిర్ణయాన్ని నిలువరించగలిగారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీప్ లిక్కర్ అంశంపై తమ పూర్తి శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొనేలా చేయగలిగితే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడినట్లే. ఇంకా వారు తమ పోరాటాలను కొనసాగించేందుకు చేవెళ్ళ-ప్రాణహిత డిజైన్ మార్పు అంశం, విద్యుత్ ఉద్యోగుల సమస్య, కేసీఆర్ ఎన్నికల హామీలు వంటి అనేక అస్త్రశాస్త్రాలు వారి చేతిలో సిద్దంగా ఉన్నాయి. వాటిపై కాంగ్రెస్ నేతలు విజ్రుంభిస్తే, తెలంగాణా కాంగ్రెస్ నేతల శక్తి సామర్ధ్యాలు ఏమిటో కేసీఆర్ ప్రభుత్వం రుచి చూసే అవకాశం కలుగుతుంది. ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆడుకొన్నారు. బహుశః ఇకపై వారు ఆయన ప్రభుత్వంతో కబడీ ఆడుకొంటారేమో?

 

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ నెల 31, వచ్చేనెల 1న రెండు రోజుల పాటు తెలంగాణాలో పర్యటనకు రాబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తెలంగాణాలో మళ్ళీ మరో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః ఇక అప్పటి నుండి తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పోరాటాలను మరింత ఉదృతం చేస్తారేమో? తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఇదే పోరాటపటిమను కొనసాగించగలిగితే తెలంగాణాలో రాజకీయ బలాబలాలు సమీకరణలు మారడం తధ్యమని చెప్పవచ్చును.

 

వారు ఇదే పోరాటపటిమను సార్వత్రిక ఎన్నికలలో ప్రదర్శించి ఉండి ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి ఉండేది. కానీ అప్పుడు వారందరూ తమ బంధువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పార్టీ టికెట్లు సాధించుకోవడం, పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను దింపి ఆ కుర్చీలో తాము కూర్చోవాలనే ప్రయత్నాలు చేసారు తప్ప కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాను ఇచ్చిందని గట్టిగా ప్రచారం చేసుకొని ఎలాగయినా పార్టీని గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నించలేదు. చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొంటున్నట్లుగా ఇప్పుడు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయడం ఆరంభించారు. ఏమయినప్పటికీ మిగిలిన ఈ నాలుగేళ్ల వ్యవధిలో అధికార తెరాసని డ్డీ కొంటూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణాలో లేచి నిలబడుతుందో లేక ఆలోగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వివీర్యం చేస్తారో చూడాలి.