ఈ ప్రత్యేక పోరాటాలు దేని కోసం?
posted on Aug 29, 2015 11:35AM
ప్రత్యేక హోదా కోరుతూ ఈరోజు ఏపీ రాష్ట్ర బంద్ నిర్వహిస్తోంది వైకాపా. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, అందరూ కలిసి పోరాటాలు చేస్తే కేంద్రమయినా, చంద్రబాబు నాయుడయినా దిగిరాక తప్పదని జగన్ వాదిస్తున్నారు. తమ పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ ని అడ్డుకొన్నవారు చరిత్రహీనులు అవుతారని శపిస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వస్తాయని యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే, హోదా అక్కరలేదు ప్యాకేజి చాలని ముఖ్యమంత్రి అంటున్నారని, దాని వలన యువత తీవ్రంగా నష్టపోతారని జగన్ వాదిస్తున్నారు.
రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇటువంటి సమయంలో చాలా సంయమనం పాటించాల్సిన ప్రతిపక్షాలు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అధికార పార్టీపై రాజకీయ కక్ష తీర్చుకొనేందుకు ప్రత్యేక హోదా పేరుతో చేస్తున్న ఈ ధర్నాలు, బంద్ ల వలన ఇప్పటికే దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు మరింత దిగజారడం తధ్యం. వాటి ఆందోళనలు, ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చూసి రాష్ట్రానికి రావాలనుకొంటున్న పరిశ్రమలు కూడా వెనక్కి మళ్ళిపోయే ప్రమాదం ఉంది. “రాష్ట్రాభివృద్దికి సహకరిస్తాము” అని చెపుతున్న వైకాపా అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా పేరిట రాష్ట్రంలో బందులు ధర్నాలు చేస్తూ రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం సృష్టిస్తూ, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూసేందుకే భయపడేలా చేస్తోంది.
ఒకప్పుడు తెలంగాణాలో తెరాస పోషించిన పాత్రనే ఇప్పుడు ఆంధ్రాలో వైకాపా పోషిస్తోందని చెప్పవచ్చును. ఆనాడు తెరాస చేసిన పొరపాట్లకు తెరాస ప్రభుత్వం ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కలలు సాకారం చేసుకోవడానికి జరుపుతున్న పోరాటాలకి రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడమే ముఖ్యం తప్ప అది ప్రత్యేక హోదా ద్వారా జరగాలా లేక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా జరగాలా అనేది ముఖ్యం కాదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకుపోయే పరిస్థితులు లేవని గ్రహించి, ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని వైకాపా పట్టుబట్టడం చూస్తుంటే ఆ పార్టీకి ప్రత్యేక హోదా అనేది తమ పోరాటాలను కొనసాగించేందుకు ఒక వంక మాత్రమేనని అర్ధం అవుతోంది.
ఈ అంశం పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. కానీ జగన్ కేంద్రాన్ని నిలదీయకుండా ఎంతసేపూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం గమనిస్తే అయన పోరాటం ఎవరి మీదో, ఎందుకోసమో అర్ధం అవుతుంది. అలాగే మరో మూడేళ్ళలో తెదేపా ప్రభుత్వం కూలిపోవడం తధ్యమని, తమ పార్టీ అధికారంలోకి రావడం, తను ముఖ్యమంత్రి అవడం తధ్యమని ఆయన పదేపదే చెప్పుకోవడం గమనిస్తే ఆయన చేస్తున్న ఈ పోరాటాలన్నీ అందుకేనని అర్ధం అవుతోంది.
నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, కొన్ని వారాల క్రితం రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చినప్పుడు వైకాపా కంటే తమ కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా గురించి గట్టిగా పోరాడుతోందని ప్రకటించగానే, మేల్కొని పోరాటం ఆరంభించిన సంగతి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కంటే తమ పార్టీ వెనుకబడిపోయిందనే దుగ్ధ తప్ప ప్రత్యేక హోదా కోసం కాదని అర్ధమవుతోంది. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకొంటే అప్పుడు ఆ పార్టీని కూడా వైకాపా ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితి కలుగకూడదంటే, దానికంటే ఉదృతంగా ఉద్యమాలు చేసి ప్రజలు తనవైపు ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. బహుశః అందుకే జగన్ ప్రత్యేక హోదా కోసం అకస్మాత్తుగా పోరాటాలు మొదలుపెట్టినట్లుంది.
కానీ దాని వలన రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతుందని తెలిసినా, భావోద్వేగాలకు లోనయి ప్రజలు ప్రాణాలు తీసుకొంటున్నారని తెలిసినా వైకాపా ఈవిధంగా బందులు, ధర్నాలు చేయడం బాధ్యతారాహిత్యమేనని చెప్పక తప్పదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు చూస్తే జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఉన్న తేడా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. “ప్రత్యేక హోదా గురించి మోడీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొంటారని ఆశిస్తున్నాను. కనుక దేశ మరి కొంత కాలం వేచి చూద్దాం. అప్పటికీ న్యాయం చేయకపోతే ఏమి చేయాలో అప్పుడు ఆలోచిద్దామని” ట్వీట్ మెసేజ్ పెట్టారు. అలాగే ఇంతకు ముందు పోస్ట్ చేసిన ట్వీట్ మేసేజులో రాజకీయ పార్టీలకు ప్రజాశ్రేయస్సే పరమావధిగా ఉండాలని తెలిపారు. కానీ వైకాపా చేస్తున్న ఈ ధర్నాలు, బంద్ ల వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇంకా దిగజారిపోయి, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని జగన్ భావిస్తున్నట్లున్నారు. కనుక ఆయన ముఖ్యమంత్రి కలలు నెరవేర్చుకోవడానికి చేస్తున్న ఈ పోరాటాలలో పాల్గొనాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవలసి ఉంటుంది.