హోదా ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా?

 

ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మాటలతో దాదాపు స్పష్టమయిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకంటే ఎక్కువే నిధులు ఇస్తామని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రూ. రూ. 2, 25, 486 కోట్ల ఆర్ధిక ప్యాకేజి కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నివేదిక ఇవ్వడం కూడా అదే సూచిస్తోంది. కనుక ఇక బంతి ప్రతిపక్షాల, రాష్ట్ర ప్రజల కోర్టులో పడినట్లుగానే భావించాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధించుకోవాలా? లేకపోతే కేంద్రప్రభుత్వం ఇవ్వబోయే ఆర్ధిక ప్యాకేజీని తీసుకొని తృప్తి పడటమా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

 

దీనిపై ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చును. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు, తమ పార్టీ క్యాడర్లను చైతన్యంగా ఉంచుతూ, పార్టీలను బలపరుచుకొని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలకు ఇది చాలా చక్కటి అవకాశం కల్పిస్తోంది. కనుక వారు దీనిపై పోరాటానికే మొగ్గు చూపవచ్చును. కనుక ప్రజలే విజ్ఞతతో ఆలోచించి ఏవిధంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి తమకు ఎక్కువ మేలు జరుగుతుందో ఆలోచించుకోవలసి ఉంటుంది.

 

ఇంతకు ముందు, రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసీ కూడా రాష్ర్టంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఉద్యమబాట పట్టించాయి. కానీ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన హక్కులు, హామీలు, నిధులు, ప్రయోజనాల కోసం అవి పోరాడలేదు. ఆ కారణంగానే నేడు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆనాడు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి దైర్యంగా ప్రజలకు చెప్పి, రెండు రాష్ట్రాల ప్రజలకి పూర్తి న్యాయం జరగాలని కోరారు. ఆయన రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటున్నారని, రెండు కళ్ళ సిద్దాంతం అని అర్ధం పర్ధం లేని మాటలు చెపుతున్నారని ఆరోపిస్తూ మిగిలిన పార్టీలు ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ విభజన తరువాత రాష్ట్రానికి దక్కవలసిన ప్రయోజనాల గురించి గట్టిగా పోరాడి ఉండి ఉంటే బహుశః నేడు రాష్ర్టంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావేమో? ప్రత్యేక హోదా అంశాన్ని కూడా విభజన చట్టంలో చేర్చి ఉండవచ్చును. రాష్ట్రానికి విడుదల చేయవలసిన నిధులు, వాటి విడుదలకు నిర్దిష్ట గడువులు విభజన చట్టంలోనే వ్రాసుకొనే అవకాశం ఉండేదేమో? కానీ ఆనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయలేదు.

 

ఆ కారణంగానే విభజన తరువాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. మళ్ళీ అవిప్పుడు ప్రత్యేక హోదా అనే అంశాన్ని కూడా తమ రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలేనే ఉద్దేశ్యంతోనే ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. భూసేకరణ, ప్రత్యేక హోదాపై పోరాడుతున్నానని చెప్పు కొంటున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ తరువాత ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు తనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడమే ఇందుకు చక్కటి నిదర్శనం.

 

ఇప్పటికే ఏడాదిన్నర విలువయిన సమయం గడిచిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెడితే ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పటికే దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఈ బందులు, ధర్నాలు, ర్యాలీల కారణంగా మరింత దీనస్థితికి దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులు చూసి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు వెనుకాడుతున్నవాళ్ళు పక్క రాష్ట్రాలకి తరలిపోయే ప్రమాదం ఉంది. దాని వలన ప్రతిపక్షాలకి ఎటువంటి నష్టమూ ఉండదు కానీ, రాష్ట్ర ప్రజలే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమే. కానీ దాని కోసమే పోరాడుతూ ఇంకా సమయం వృదా చేసుకోవడం అవసరమా కాదా అని ఆలోచించాల్సిన సమయమిది.

 

ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినందుకు కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు తలదించుకొని ఉంది. దానికి ప్రాయశ్చితం చేసుకొనేందుకు సిద్దంగా ఉంది. రాష్ట్రానికి అవసరమయిన నిధులు, సబ్సీడీలు, పన్ను రాయితీలు, ప్రాజెక్టులు అన్నీ సమకూర్చుతామని అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించారు. కనుక వాటిని స్వీకరించి వీలయినంత వేగంగా రాష్ట్రాభివృద్ధి చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఇప్పుడు కూడా కేంద్రప్రభుత్వం సకాలంలో తగినన్ని నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లయితే దానిపై తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించవలసిందే. కానీ ఈ అంశంపై ప్రతిపక్షాల వాదనలను నమ్మి ఉద్యమాలు, బందులు చేసుకొంటూపోతే చివరికి ప్రజలే నష్టపోవలసివస్తుంది,మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కనుక ప్రజలే తమ విజ్ఞత ప్రదర్శించి తగిన విధంగా స్పందించడం మంచిది.