పరిటాల నుండి తుని ఘటన వరకూ.. చేయిచేయి కలిపి ప్రతిజ్ఞ
posted on May 27, 2016 3:16PM
తిరుపతిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘమైన ఉపన్యాసమే చేశారు. ఈ ప్రసంగంలో ఆయన పలు అంశాలను లేవనెత్తారు. ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. నాటి పరిటాల హత్య కేసు నుండి ఇటీవల జరిగిన తుని ఘటన వరకూ ఆయన ప్రస్తావించి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోశారు. పరిటాలది ముమ్మాటికి అప్పటి ప్రభుత్వ హత్యేనని.. ఈ విషయంపై అప్పటి అసెంబ్లీలో వైఎస్సార్ ని కూడా నిలదీశానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అరాచక శక్తులు చెలరేగినా దాని వెనుక వైఎస్ఆర్ కుటుంబసభ్యుల హస్తం ఉంటుందని.. ఈ మధ్య జరిగిన తుని ఘటనలో కూడా వారి హస్తం ఉందని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం.. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. నిధులు లేకపోయినా రైతు రుణాలు మాఫీ చేశాం.. నీరు ప్రగతి వల్ల చరిత్ర సృష్టించాం.. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే తమ అభిమతమని, గృహ నిర్మాణాన్ని మరింత సులభం చేసేందుకే ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అడ్డుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు ప్రసంగం పూర్తి అయిన అనంతరం వేదికపై ఉన్న నేతలందరూ చేయిచేయి కలపి రాష్ట్రప్రగతికి ప్రతిజ్ణ చేశారు. చంద్రబాబుకు ఒక వైపు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, మరో వైపు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావు ఉన్నారు.