వైసీపీలో జగన్ ఒంటరేనా?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కొంద‌రు వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నామ‌న్న భ్ర‌మ‌ణ‌ల్లోనే ఉన్నారు. ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులుమీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది.

వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రోవైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలా మంది వైసీపీ నేత‌లు మ‌న‌వంతు ఎప్పుడొస్తుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ మెప్పు కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరెత్తేందుకే భయపడుతున్నారు. 

ఈ పరిస్థితుల్లో కేసుల గురించి భయపడవద్దంటూ జగన్ పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పడానికి చేసిన ప్రయత్నం ఏమంత ప్రభావం చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు.  రోజులు గడుస్తున్న కొద్దీ  వైసీపీ నేతలలోనూ, క్యాడర్ లోనూ నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైసీపీ నేతలు మరింతగా భయాందోళనలకు గురౌతున్నారు. ఆ పార్టీలో  నోరున్న నేతలుగా పేరున్న వారంతా దాదాపుగా అజ్ణాత వాసం గడుపుతున్నారని చెప్పవచ్చు. కొడాలి నాని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలు కాగా, పెద్దిరెడ్డి బాత్ రూంలో జారిపడి చేయి విరగ్గొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి అరెస్టు భయంతో అండర్  గ్రౌండ్ కు వెళ్లిపోయారు.

ఇక ఆర్కేరోజా, అనీల్ కుమార్ యాదవ్, పేర్ని నాని వంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు మౌనముద్ర వహించి.. నోరెత్తడానికే జంకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  వైసీపీలో కీలక నేతలంతా తమను తాము కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో జగన్ ఒంటరిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.