నిద్రను మరవద్దు...

 

1. హాయిగా కంటినిండా నిద్రపోవడం ఓ వరంగా మారింది ఈరోజుల్లో . నిద్రపోవడానికి తగినంత సమయమూ లేదు, అలాగే ప్రశాంతంగా నిద్రపోయే మానసికస్థితి ఉండటం లేదు. నిద్రే కదా ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. చక్కటి ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే అవసరమని గట్టిగా చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం, అలాగే వేళాపాళా లేని నిద్ర వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. అలాగే నిద్ర తక్కువైనపుడు మనలో కోపోద్రేకాలు పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు.

2. నిద్ర తగ్గడం వలన మెదడులోని ఉద్వేగ కేంద్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందట. ఫలితంగా మానసిక ఉద్వేగం పెరుగుతుందని మెదడు స్కానింగ్ లతో చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. నిద్రలేమి ఉండే వారిలో మెదడులో ముందు భాగమైన ప్రీఫంటల్ లోబ్ లో హైపరాక్టివ్ ఎమోషనల్ రెస్పాన్స్ తగ్గుతున్నట్లు తేలింది. మనలో మానసిక ఉద్వేగాలను నియంత్రించేది ఈ భాగమే కాబట్టి తగినంత నిద్రలేనప్పుడు మనలో సరైన మానసిక సమత్యులత ఉండదని, కోపం, ఉద్రేకం వంటివి కమ్ముకుంటాయని తేల్చారు హార్వర్ట్ మెడికల్ స్కూల్ వారు.

3. నిద్రకి మన కోపతాపాలకి ఉన్న సంబంధం గురించి చెప్పుకుంటున్నాం కదా. నిద్రలేమికి, మానసిక సమస్యలకు కూడా ఎంతో కొంత సంబంధం ఉన్నట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారి అధ్యయనాలలో గుర్తించారు. చక్కని నిద్ర మన మెదడులోని భావోద్వేగ కేంద్రాలను శాంతపరచి మరుసటిరోజు ఎదుర్కోవాల్సిన సవాళ్లు, పూర్తి చేయాల్సిన పనులకోసం సమాయత్తం చేస్తుందని పేర్కొన్నారు. నిద్రలేమితో చాలా సమస్యలు ఉంటాయని, కోపం, డిప్రెషన్ లు పెరుగుతాయని అంటున్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు కూడా .వీరు 26 మంది సాధారణ ఆరోగ్యవంతులను అధ్యయనం చేసి, పరిశీలించి వారి మెదడుల స్కాన్ లను విశ్లేషించి పై నిర్ణయానికి వచ్చారు.

4. 26 మంది సాధారణ ఆరోగ్యవంతులను 35 గంటలపాటు నిద్రలేకుండా మెలకువగా ఉంచారు. ఆ తరువాత వారందరి మెదడు స్కాన్లనూ పరిశీలించగా వారి మెదళ్లు 60 శాతం తీవ్రంగా ప్రతిస్పందించడం గమనించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు నిద్రలేనప్పుడు మెదడు పనితీరు కనిష్ఠ స్థాయికి చేరి ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక పోతున్నట్లు గుర్తించారు వీరు. అందుకే నిద్ర శరీరానికి జీవావసరమని, అది మన ఉద్వేగాన్ని, మానసిక ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుందని గుర్తించి రోజూవారి కార్యకలాపాలలో నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించమని సూచిస్తున్నారు ఆ పరిశోధకులంతా.

5. రోజూవారి పని ఒత్తిళ్లు వంటివి మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుందంటారు. వాటి నుంచి ఉపశమనానికి నిద్రని మించిన ఔషదం లేదని చెబుతున్నాయి పరిశోధనలు. పిల్లల నుంచి పెద్దల దాకా సమయాన్ని ఒడిసి పట్టుకునే తాపత్రయంలో నిద్రని తక్కువ అంచనా వేస్తుంటాం. అందులోనూ ఆడవారు పౌష్టికాహారం, నిద్ర వంటి ముఖ్యమైన విషయాలపై తగినంత శ్రద్ధ పెట్టరు. కాని అది శారీరక, మానసిక ఆరోగ్యాలని తీవ్రంగా దెబ్బతీస్తుందని గుర్తించి తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.

-రమ

Related Segment News