క‌ష్టాల్లో బీఆర్ఎస్‌.. చేతులెత్తేసిన కేసీఆర్‌?

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ప‌రిస్థితి ఇలానే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో బీఆర్ఎస్ ప్ర‌భావం ఇసుమంత కూడా ఉండ‌ద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల‌ను, క్యాడర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్నది. అయితే  కొంద‌రు పార్టీ నేత‌లు మాత్రం కేసీఆర్ పై ఆశ‌లు పెట్టుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పాలిటిక్స్‌లో మ‌ళ్లీ యాక్టివ్ అవుతార‌ని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ద‌బిడిదిబిడే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ  బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. కేసీఆర్ రాజ‌కీయాల నుంచి పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నాటి నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. కేటీఆర్ అరెస్టు అయినా కూడా కేసీఆర్‌ బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చున‌ని, హ‌రీశ్‌, క‌విత‌లే పార్టీ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌న్న చ‌ర్చ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. మ‌రోవైపు, కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల వారిగా నేత‌లు ఆయ‌న్ను క‌లిసి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతోంద‌నీ, మీరు పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ కావాల‌ని విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప‌దేళ్లు పాలించిన కేసీఆర్‌,  2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ త‌రువాత  ఆయ‌న ఇంట్లో స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురై కొన్ని రోజులు బెడ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల స‌మ‌యంలో ప‌లు బ‌హింగ స‌భ‌ల్లో పాల్గొని కేసీఆర్ ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కుకూడా కేసీఆర్ హాజ‌రు కాలేదు. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్రం అసెంబ్లీకి హాజ‌రైన కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీది చెత్త‌ బ‌డ్జెట్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌ నుంచి ప్ర‌తీరోజూ అసెంబ్లీకి వ‌స్తాన‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ  త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను చీల్చిచెండాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాకుండా డుమ్మా కొడుతున్నారు.   కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన అనుభవం మాకు మార్గదర్శకంగా ఉంటుందని ప‌లుసార్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించినా కేసీఆర్ పట్టించుకోలేదు. అసెంబ్లీకి ముఖం చాటేశారు. అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కడా కేసీఆర్ కనిపించడంలేదు.  పార్టీ నేతలు ఎవరైనా ఇంటికి వెళ్లి కలిస్తే వారితో మాట్లాడి పంపిచేస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరికలు అంటూ కొంత మందిని తీసుకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అది అధికారిక వీడియో కాదు. ఓ వ్యక్తి ఫోన్లో  తీసిన వీడియో. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడప్పుడే బయటకు రావాలని అనుకోవడం లేదు.

కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సుమారు ఐదు నెల‌లు జైలు జీవితం గ‌డిపారు. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురైన‌ట్లు ఆ పార్టీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో  పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనూ కేసీఆర్ ఆందోళ‌నలో ఉన్నారని అంటున్నారు. అయితే, 2025 జనవరి  నుంచి కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారని గ‌తంలో ప‌లుసార్లు కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌టంతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితి అందుకు విరుద్దంగా క‌నిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ లేదా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఏసీబీ పెట్టిన ఫార్ములా ఈ-కారు కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీష‌న్ ను కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇహనో ఇప్పుడో కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్ రావు, క‌విత భుజానికెత్తుకోనున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే క‌నీసం ఆరేడు నెల‌ల్లు లేదా ఇంకా ఎక్కువ కాలం  జైల్లో ఉండే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కార్‌ దూకుడు ముందు హ‌రీశ్ రావు, క‌విత సార‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ  ఏ మేర‌కు నిల‌దొక్కుకోగ‌ల‌దన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద పార్టీ  కష్టాల్లో ఉన్నా కేసీఆర్ బయటకు రావడం లేదంటే పార్టీ విషయంలో ఆయన చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది. 

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యి.. కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కాకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో జిల్లాల వారిగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ ఆ పార్టీ నేత‌ల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ మాత్రం ఇక నావ‌ల్ల కాదు అన్న‌ట్లుగా చేతులెత్తేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ చ‌ర్చే నిజ‌మైతే రాబోయే కాలంలో బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న ఉంది.