స్వర్గీయ యన్టీఆర్ ఎవరివాడు?
posted on Nov 22, 2014 6:33AM
గాంధీ, నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్ వంటి మహానుభావులను కూడా రాజకీయ పార్టీలు వాటాలేసుకొని పంచేసుకొంటున్న రోజులివి. టంగుటూరి, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములవారిని కూడా కులాలు వారిగా పంచేసుకొంటున్న రోజులివి. ఆ చేత్తోనే దేవుళ్ళని కులాలు, ప్రాంతాల వారిగా పంచేసుకొంటున్నారు. ఆంద్ర దేవుడయిన ఏడుకొండల వెంకన్నకు మనం మొక్కడమేమిటి...అని భావించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వాములవారిని ‘ఎడాప్ట్’ చేసుకొంటే, దానికి బేషరతు మద్దతు ప్రకటించాడు మన రామ్ గోపాలవర్మ. అంతేకాదు తెలంగాణా ప్రజలు ఆంద్ర వెంకన్నకు మొక్కడం అంటే లక్ష్మీ నరసింహ స్వాములవారిని ఇన్సల్ట్ చేసినట్లేనని ఆయన తీర్మానించాడు కూడా.
దేవుళ్ళని, దేశనాయకులనీ కూడా కులాలు, ప్రాంతాల వారిగా వాటాలేసి పంచుకొంటున్నప్పుడు, ఆంధ్రా హీరో స్వర్గీయ యన్టీఆర్ పేరును తెలంగాణాలో ఉన్న విమానాశ్రయానికి పేరుపెడితే కేసీఆర్ కి ఆగ్రహం వచ్చిందంటే రాదూ..? ఆయనకే కాదు తెలంగాణా కాంగ్రెసోళ్లకు మిగిలిన పార్టీల వాళ్ళకీ కూడా నచ్చలేదు. అందుకే ‘ఆ పేరు మాకు వద్దు’ అని శాసనసభలో నిన్న తీర్మానించారు కూడా. అందుకు తెదేపా, బీజేపీలు అభ్యంతరాలు వ్యక్తం చేసి తమ వాదనలు వినిపించాయి.
అయితే ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ, తన పార్టీ జెండా దిమ్మకు గౌరవం దక్కని నిమ్మకూరులో తాను జీవితంలో మళ్ళీ కాలు పెట్టనని శపథం చేసిన స్వర్గీయ యన్టీఆర్, ఒకవేళ బ్రతికివస్తే తనకు గౌరవం లేని చోట తన పేరు పెట్టడాన్ని అంగీకరించేవారు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. గాంధీ, నెహ్రు, సుబాష్ చంద్ర బోస్,అంబేద్కర్ తదితరులు ‘మనోళ్ళు కాకపోయినప్పటికీ దేశంలో ప్రతీ మారుమూల గ్రామాల్లో ఆ మహానుభావుల విగ్రహాలను పెట్టుకొని ప్రజలు పూజిస్తుంటారు. కానీ తెలుగుజాతికే ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు స్వర్గీయ యన్టీఆర్ మాత్రం పరాయివాడయిపోయాడు.
కానీ దేవుళ్ళనే కులాలు, ప్రాంతాల వారిగా వాటాలేసుకొని పంచేసుకొంటున్న ఈ రోజుల్లో ఆయనకు కూడా మినహాయింపు ఉండదని ఇంత ఖచ్చితంగా తేల్చి చెప్పిన తరువాతయినా కేంద్రం ఈ విషయంలో పునరాలోచించుకొని, ‘ఆ మహానుభావుడిని ఆంధ్రాకే కేటాయిస్తే’ బాగుంటుంది. త్వరలో విజయవాడలో నిర్మించబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టి గౌరవిస్తే, పైనున్న ఆయన సంతోషిస్తారు.... తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను తమకు అప్పగించేసినందుకు ఆంధ్రా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు.