రేవంత్ కి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ

 

ఏసిబి అధికారులు తెదేపా కొండగల్ యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరచగా అయన రేవంత్ రెడ్డికి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కానీ ఈరోజు జరగనున్న శాసనమండలి ఎన్నికలలో ఆయనను ఓటు వేసేందుకు అనుమతించడంతో కొద్ది సేపటి క్రితమే ఏసిబి అధికారులు కట్టుదిట్టమయిన భద్రత నడుమ రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకువచ్చారు. అక్కడ ఆయన కోసం వేచి చూస్తున్న తెదేపా శాసనసభ్యులు, ఆయన రాగానే అందరూ కలిసి తెదేపా శాసనసభా పక్ష కార్యాలయంలోకి వెళ్ళబోతుంటే వారిని ఏసిబి అధికారులు అడ్డుకొన్నారు. తాము అందరం ఏవిధంగా ఓటింగ్ వేయాలనే విషయంపై ముందుగా చర్చించుకోవాలని అది కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగమేనని తెదేపా యం.యల్యేలు గట్టిగా చెప్పడంతో ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని అందుకు అనుమతించారు. ఓటింగ్ అనంతరం ఆయనని చర్లపల్లి జైలుకి తరలించవచ్చును. రేవంత్ రెడ్డికి బెయిలు కోసం మరికొద్ది సేపటిలో ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషను వేయబోతున్నారు.