మరికొద్ది సేపటిలో కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభం
posted on Jun 1, 2015 8:41AM
మరి కొద్దిసేపటిలో తెలంగాణా శాసనమండలి ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తరువాత 5గంటలకు ఓట్లు లెక్కింపు చేసి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. యం.యల్యే.ల కోటా క్రింద జరుగుతున్న ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
తెరాస తరపున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్ రావు,యాదవ రెడ్డి, బి.వెంకటేశ్వరులు అభ్యర్ధులుగా నిలబడ్డారు. కాంగ్రెస్ తరపున ఆకుల లలిత, తెదేపా-బీజేపీ కూటమి తరపున వేం నరేంద్ర రెడ్డి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన ఏడుగురు యం.యల్యేలు వైకాపాకు చెందిన ఒక యం.యల్యే తెరాసకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించగా, చెరో ఒక్క సీటు ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం 18మంది, తెదేపా(11), బీజేపీ(5) లకు కలిపి మొత్తం 16 మంది యం.యల్యేలున్నారు. ఒక్కో యం.యల్సీ. అభ్యర్ధికి కనీసం 18మంది యం.యల్యేల మద్దతు ఇస్తే తప్ప ఎన్నికలలో గెలవలేరు. కనుక కాంగ్రెస్ అభ్యర్ధికి ఆ పార్టీకి చెందిన అందరు యం.యల్యేలు తప్పకుండా ఓటేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస వైపు మళ్ళినా ఆ పార్టీ అభ్యర్ధి గెలుపు అనుమానమే. ఇక తెదేపాకు చెందిన మాధవరం కృష్ణారావు మొన్న తెరాసలోకి పార్టీ ఫిరాయించడం, పార్టీ సీనియర్ యం.యల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు నిన్న అరెస్ట్ చేయడంతో తెదేపా యం.యల్సీ. అభ్యర్ధి గెలుపు అనుమానాస్పదంగానే కనబడుతోంది.
తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 8మంది యం.యల్యేలను తెరాస ఆకర్షించగలిగినప్పటికీ వారందరికీ కూడా ఆ రెండు పార్టీలు విప్ జారీ చేసినందున, వారు తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వారు అందుకు సిద్దపడి ఓటు వేస్తారా లేదా అనే దానిపై తెరాస ఐదవ అభ్యర్ధి జయాపజయాలు నిర్ణయం అవుతాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమ ఐదవ అభ్యర్ధిని ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కనుక కాంగ్రెస్, తెదేపాల నుండి తెరాసలో చేరిన ఆ పార్టీల యం.యల్యేలు తమ పార్టీలు జారీ చేసిన విప్ ని దిక్కరించి తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఒకవేళ ఇదంతా ప్రతిపక్షాలను గందరగోళంలో పడేయడానికే తెరాస అధ్యక్షుడు పన్నిన వ్యూహమయితే చివరి నిమిషంలో తెరాస తన ఐదవ అభ్యర్ధిని పక్కనబెట్టినా ఆశ్చర్యం లేదు.