తెరాస, కాంగ్రెస్ అభ్యర్ధులకే గెలుపు అవకాశాలు
posted on Jun 1, 2015 10:34AM
తెలంగాణా శాసనమండలి ఎన్నికలకు వామపక్షాలు రెండూ దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో ఇప్పుడు ఒక్కో యం.యల్సీ అభ్యర్ధి గెలుపుకి 17మంది యం.యల్యేల మద్దతు ఉంటే సరిపోతుందని తేలింది. మజ్లీస్, వైకాపాల 8మంది యం.యల్యేల మద్దతు, ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన 8మంది యం.యల్యేలతో కలిపి తెరాస బలం ఇప్పుడు మొత్తం 85కి చేరింది. కనుక ఇక ఆ పార్టీ ఐదవ అభ్యర్ధి విజయం కూడా దాదాపు ఖాయం అయినట్లే భావించవచ్చును. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆకుల లలిత విజయం కూడా ఖాయమనే చెప్పవచ్చును. ఆరు స్థానాలలో ఐదింటిని తెరాస, ఒకటి కాంగ్రెస్ దక్కించుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తెదేపా అభ్యర్ధి వేం నరేంద్ర రెడ్డి ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తెదేపా యం.యల్యే రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి జడ్జి లక్ష్మీపతి అంగీకరించడంతో ఆయన కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.