తెలుగు ప్రజలంటే అందరికీ అంత చులకన ఎందుకో?
posted on Aug 26, 2015 2:15PM
ఆంద్రప్రదేశ్ రాష్ట్రమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికయినా ఎందుకు చిన్నచూపు, అలుసో తెలియదు కానీ సమైక్యంగా ఉన్నప్పుడు, విడిపోయిన తరువాత కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంతకు ముందు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన కంచుకోటలాగా ఉండేది. అనేక ఏళ్లబాటు తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోశారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో, రాష్ట్రంలో ఏకధాటిగా అధికారం చెలాయించగలిగింది అంటే అందుకు తెలుగు ప్రజలు ఆపార్టీ పట్ల చూపిన ఆధారణే కారణం.
కానీ తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పదేళ్ళపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతమంది బలిదానాలు చేసుకొన్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. తనకు నచ్చినప్పుడు తనకు నచ్చినట్లు రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. తెలుగు ప్రజలంటే ఆ పార్టీకి ఎంత చులకన అంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే తనకు ప్రయోజనం కలుగుతుందా...లేకపోతే మూడు ముక్కలు చేస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా...అని ఆలోచించిందే తప్ప, తన ఆలోచనలతో తెలుగు ప్రజల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో పట్టించుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ లక్షలాది ఆంద్ర ప్రజలు రెండున్నర నెలలపాటు ఉద్యమాలు చేసినప్పుడు అవన్నీ సిల్లీ ఉద్యమాలు అంటూ కొట్టిపడేసింది.
చివరికి రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేస్తున్నప్పుడు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించిందో అందరూ చూసారు. ఆంధ్రా ప్రజల పట్లే కాదు చివరికి తన ఆంధ్రా ఎంపీలను కూడా పూచికపుల్లలాగ తీసి పడేసింది. ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసినందుకు రాష్ట్ర ప్రజలపట్ల కృతజ్ఞత చూపకపోగా వారి అభిప్రాయాలతో మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని తనకు నచ్చినట్లు విడదీసి చేతులు దులుపుకొంది. రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ ఆ రాష్ట్రానికి కూడా చాలా అన్యాయం చేసింది. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో పక్కనపడేశారు.
కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెదేపా, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అవి భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. వాటి మధ్య చాలా చక్కటి సత్సంబంధాలున్నాయి. ఆ కారణంగానే రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యా సంస్థలు, నిధులు వగైరా మంజూరు అవుతున్నాయని భావించవచ్చును. కానీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఇప్పుడు తాజాగా విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రప్రభుత్వం ప్రతీ దానికి ఒక్కో కారణం చెపుతూ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల గురించి మోడీకి మళ్ళీ నిన్న మరొక్కమారు వివరించారు. కనుక కనీసం ఇకనుండయినా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేస్తుందని ఆశిద్దాము.