ఆ ఒక్కట్టీ తప్ప ఏదయినా ఒకే!
posted on Aug 25, 2015 2:10PM
ఎన్నాళ్ళుగానో అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. కీలకమయిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబుతో కలిసి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలు తెలియజేసారు. విభజన చట్టంలో ఉన్న అన్ని హామీల అమలు చేయడానికి అవసరమయిన రోడ్ మ్యాప్ తయారు చేయాలని నీతి ఆయోగ్ (ప్రణాళికా సంఘం) అధికారులను ప్రధాని ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులకి అవసరమయిన నిధులు మంజూరు చేసేందుకు ప్రధాని అంగీకరించారని తెలిపారు. నీతి ఆయోగ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారని ఆర్ధికమంత్రి జైట్లీ అన్నారు. ప్రత్యేక హోదా గురించి కూడా ఈ సమావేశంలో ప్రధానితో చర్చించామని, దానికి సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని తెలిపారు.
విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ తదితరులు చాలా కాలంగానే చెపుతున్నారు. కనుక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అదే విషయం మళ్ళీ కొత్తగా చెప్పడం అందరికీ చాలా నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజలు ఆయన నుండి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజిలపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన ఆశించారు. కానీ ఆయన ఆ రెంటి గురించి ఎటువంటి నిర్దిష్టమయిన హామీని ఇవ్వలేదని స్పష్టం అయ్యింది. ఆర్ధిక ప్యాకేజీ ప్రకటనకు మరికొంత సమయం తీసుకొన్నా కనీసం ప్రత్యేక హోదా అంశంపై నిర్దిష్టమయిన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఈరోజు కూడా ప్రత్యేక హోదా సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం ద్వారా ఏపీతో సహా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ప్రణాళిక శాఖా మంత్రి ఇంద్రజిత్ సింగ్ కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో చేసిన ప్రకటనని దృవీకరిస్తున్నట్లుంది.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయింది. రాష్ట్ర విభజన వలన ఆంద్రప్రదేశ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, దానికి ఎటువంటి సహాయం అవసరముందో ఆయనకీ తెలుసు. కానీ ఏడాదిన్నర గడిచిన తరువాత కూడా రాష్ట్రానికి ఏమేమీ చేయవలసి ఉందో నిర్ణయించేందుకు ఇంకా రోడ్డు మ్యాపు తయారు చేయాలని అనడం ప్రజలని విస్మయానికి గురి చేసింది. కేంద్రప్రభుత్వం తరపున ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తను చెప్పవలసింది కాస్త చెప్పేశారు కనుక ఇక రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించడానికి సిద్దం అయ్యే ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఈనెల 29న ఏపీ బంద్ కి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు ప్రకటించడం తధ్యం. ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే మాట్లాడారు కనుక ఇప్పుడు ఆయన కూడా ఘాటుగానే స్పందించవచ్చును.