పాలు కాదు.. విషం...

 

మెదక్ పట్టణంలో గత వారం రోజులుగా ఒక పాల వ్యాపారి తక్కువ ధరకే చిక్కని పాలు అని ప్రచారం చేసుకుంటూ పాలు అమ్మడం మొదలుపెట్టాడు. సాధారణంగా లీటరు పాలు 40 రూపాయలకు అమ్ముతారు. ఈ పాల వ్యాపారి మాత్రం లీటరు పాలు 20 రూపాయలకే ఇస్తున్నాడు. పాలు ఎందుకు తక్కువ ధరకి ఇస్తున్నావని అడిగితే అతను ఏవేవో కారణాలు చెప్పి తనను తాను ఒక మంచి పాల వ్యాపారిగా పోకస్ చేసుకున్నాడు. చిక్కటిపాలు.. అందులోనూ తక్కువ ధరకి... పైగా మెదక్‌లో ఎప్పటి నుంచో పాలవ్యాపారం చేస్తున్న తెలిసిన వ్యక్తి... ఇంకేం.. జనం ఆ పాల దుకాణం ముందు క్యూ కట్టారు. వారం రోజులుగా చాలామంది మెదక్ వాసులు ఆ వ్యాపారి దగ్గర పాలు కొనడమే కాకుండా.. తమకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ పాల గురించి చెప్పి కొనిపించారు. అయితే వారం తిరిగేసరికి ఆ పాల మహిమ అర్థమైంది. సదరు పాలు తాగుతున్న వారందరికీ లేనిపోని రోగాలు వచ్చి పడ్డాయి. దాంతో అనుమానం వచ్చిన వినియోగదారులు ఆ వ్యాపారిని నిలదీసి నాలుగు పీకేసరికి అసలు విషయం చెప్పాడు. ఇంతకాలం అతను అమ్మినవి పాలు కాదు.. విషంతో సమానమైన కల్తీపాలు. సాధారణంగా కల్తీకల్లు తయారు చేసేవారు ‘గోబింద పేస్ట్’ అనే పదార్ధంతో కల్తీకల్లు తయారు చేస్తారు. ఆ పదార్ధంలో నీరు కలిపి, కొన్ని స్వచ్ఛమైన పాలు కలిపి ఈ చిక్కటి పాలు తయారు చేశాడు. వినియోగదారుల ఫిర్యాదుతో ఆ పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.