హైదరాబాద్ లో వర్షం.. ఒక్కసారిగా కూల్ అయిన వాతావరణం

గత కొన్ని రోజులుగా భానుడి భగభుగలతో, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరవాసులకు వరుణుడు ఒకింత ఉపశమనాన్ని ఇచ్చాడు. గురువారం మధ్యాహ్నం వరకూ చండ్ర నిప్పులు చెరుగుతున్నట్లుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం తరువాత హఠాత్తుగా చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది.

 నగరంలోని చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేటలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒక్క హైదరాబాద్ అనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.  నారాయణపేట జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. భూ ఉపరితలం వేడెక్కడంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ రెండు మూడు రోజులు వాతావరణం చల్లబడుతుందనీ, ఆ తరువాత ఎండలు ఠారెత్తిస్తాయని తెలిపింది.