భార్యతో ఏకాంతానికి అడ్డని ఆరాధ్యని చంపేశాడు
posted on Nov 26, 2014 10:27AM
ఒంగోలులో మంగళవారం నాడు ఏడాదిన్నర వయసున్న ఆరాధ్య అనే బాలిక కిడ్నాపైన విషయం తెలిసిందే. ఒంగోలులోని రాజా పానగల్‌రోడ్డులో నివసించే శ్రీధర్, సాహితి దంపతులు తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన పరిశోధనలో ఆరాధ్యను ఆమె బాబాయే హత్య చేశాడని వెల్లడయింది. ఆరాధ్య పిన్ని సింధు అనే యువతిని లక్ష్మీనారాయణ అనే యువకుడు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరాధ్య ఎప్పుడూ తన పిన్నిని విడిచిపెట్టకుండా ఆమె దగ్గరే వుండేది. దాంతో తన భార్యతో గడపడానికి ఆరాధ్య ఎప్పుడూ అడ్డుగా వుంటోందన్న కోపంతో లక్ష్మీనారాయణ ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు. మంగళవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యని బైక్ ఎక్కించుకుని ఊరిచివర్లో ఉన్న పంటచేల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆరాధ్యని గొంతు పిసికి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఆరాధ్య మీద పెట్రోలు పోసి నిప్పంటించాడు. లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.