నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు?.. శాఖ ఏది?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నాయకుడు నాగేంద్ర బాబు ఎంట్రీ ఎప్పుడన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. కొణిదెల నాగబాబు బుధవారం (ఏప్రిల్ 2) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాగబాబును కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు ప్రకటించేశారు. అయితే ఇప్పటి వరకూ ఆయన చట్ట సభ సభ్యుడు కాకపోవడంతో కేబినెట్ బెర్త్ జాప్యం అవుతూ వచ్చింద. ముందుగా కేబినెట్ లోకి తీసుకుని ఆ తరువాత చట్ట సభ ఎంట్రీకి అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ అందుకు ఇష్ఠపడలేదు. ముందుగా ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకుని ఆ తరువాతే కేబినెట్ లోకి తీసుకోవాలని భావించారు.

ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో  ఇక ఆయన కేబినెట్ ఎంట్రీ ఎప్పుడంటూ చర్చ మోదలైంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒకే ఒక్క బెర్త్ ఖాళీగా ఉంది. దానిని నాగబాబుతో భర్తీ చేయడం అన్నది లాంఛనమే. ఆ లాంఛనం ఎప్పుడన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

 అంతే కాకుండా నాగబాబుకు కేబినెట్ లో ఏ శాఖ ఇస్తారన్న విషయంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నశాఖలలో ఒక దానిని నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూటమి వర్గాలలో జరుగుతున్నది. అయితే నాగబాబుకు అప్పగించే శాఖ విషయంలో ఇప్పటి వరకూ ఒక క్లారిటీ అయితే రాలేదు. మరీ జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరలో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.