కంటైనర్లో పేలుడు.. భారీగా మంటలు
posted on Nov 25, 2014 11:13AM
పేలుడు పదార్ధాలను తీసుకుని వెళ్తున్న ఒక భారీ కంటైనర్ పేలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బొయిపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీద కంటైనర్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాంతో ఈ రోడ్డు మీద పది కిలోమీటర్లపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పేలుడు పదార్ధాలను ఈ కంటైనర్‌లో సింగరేణికి సరఫరా చేస్తున్నారు. కంటైనర్‌లో షార్ట్ సర్కూట్ జరగడం వల్ల ఈ పేలుడు సంభవించి వుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ పేలుడులో కంటైనర్ సిబ్బంది సహా ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అయితే స్థానికులు మాత్రం ఈ సంఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జనం లేనిచోట పేలుడు జరిగింది కాబట్టి సరిపోయింది. అదే జన సంచారం ఉన్న చోట జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా పేలుడు పదార్ధాలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.