మన ఆనందం మన చేతుల్లోనే...

 

ఆనందంగా ఉండటానికి, వయసుకి సంబంధం ఏముంటుంది చెప్పండి. చిన్నతనంలో హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేస్తే, ఆ తరువాత చదువు, మార్కులు అంటూ పరిగెడుతుంది జీవితం. చదువులు అయిపోయాయి అమ్మయ్య అనుకునేలోపు ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంసార బాధ్యతలు... ఆ భవసాగరాన్ని ఈదే ప్రయత్నంలో ప్రత్యేకంగా ‘ఆనందం’ కోసం ఆలోచించడానికి సమయం లేకపోయినా ఆ బాధ్యతలు, బంధాలు ఆనందాన్ని పంచుతాయి కాబట్టి అక్కడా ఆనందం వుంటుంది. ఇక్కడ వరకు బాగానే వుంది. ఆ తర్వాతే.... అంటే పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాలని వారు జీవించడం మొదలుపెట్టాకే ఈ ‘ఆనందం’ అన్న పదానికి అర్థాన్ని వెతుక్కోవటంలో పడతారు ఆడవారు.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మగవారు, ఆడవారు ఆనందంగా ఉండటం  అనేది వయసునుబట్టి మారుతుందిట. అంటే, ఉదాహరణకి మధ్య వయస్సులో కంటే మగవారు వయసు గడుస్తున్నకొద్దీ జీవితం పట్ల సంతృప్తిగా, ఆనందంగా వుంటారుట. అదే ఆడవారి విషయానికి వస్తే టీనేజ్‌లో అలాగే మధ్య వయస్సులో వీరు ఎక్కువ ఆనందంగా జీవితాన్ని గడుపుతారని వీరి విశ్లేషణ. అంటే వయస్సు పెరిగినకొద్దీ మగవారు జీవితం పట్ల ఎక్కువ సంతృప్తిని కలిగి వుంటే, అదే సమయంలో ఆడవారు అసంతృప్తిలో వుంటారుట. ఎందుకని? ఈ ప్రశ్నకి సమాధానం కోసం కేంబ్రిడ్జి పరిశోధకులు గట్టి ప్రయత్నమే చేశారు.

పురుషులు, మహిళల్లో ఆనందం, ఆశయాలు, కోరికలపై జరిగిన అనేక అధ్యయనాలు, సర్వేలను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలో బయటపడిన అంశాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయిట. తలమునకలయ్యే బాధ్యతలు ఆడవారికి ఎక్కువ సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తే, అవే బాధ్యతలు మగవారిని అసంతృప్తికి గురిచేస్తాయిట. అందుకే మధ్య వయస్సులో పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఆడవారిని ఆనందంగా ఉంచితే, ఆ వయసులో ఇవన్నీ మగవారిని ఒత్తిడికి గురిచేస్తాయిట. కాబట్టే వారు ఆ వయసులోకంటే ఆ తర్వాతి దశ అంటే 50ల వయసులో ఆనందంగా వుంటారుట.

పిల్లల బాధ్యత తీరిపోయిన క్షణం నుంచి ఆడవారిలో ఆనందంగా ఉండే సమయం కూడా తగ్గిపోవడం మొదలవుతుందిట. కారణం వారు పిల్లలతోనే తమ ఉనికి, ఆనందాన్ని చూసుకోవడమేనట. ఈ వయసులో వారిని ఒంటరితనం చుట్టుముట్టి అప్పటి వరకు గడచిన జీవితం పట్ల కూడా అసంతృప్తిగా ఉండటం గమనించారు పరిశోధకులు. ఎన్నో అధ్యయనాలు, సర్వేలు పరిశీలించిన వీరు వయస్సుతో, కుటుంబ బాధ్యతలతో, ఆర్థిక అంశాలతో ఖచ్చితంగా ఆనందం ముడిపడి వుంటుందని చెబుతున్నారు.

జీవితమంతా ఆనందంగా గడపగలిగినప్పుడే అందం, ఆనందం కూడా. నా ఆనందం ఈ విషయంపై ఆధారపడి వుంటుంది అని గిరిగీసుకుంటే అసంతృప్తి మనల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా ఆడవారు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో, భర్తతో, పిల్లలతో ఇలా ఎవరో ఒకరితో తమ ఆనందాన్ని ముడిపెట్టడం వల్ల ఎక్కువశాతం అసంతృప్తితో జీవితాన్ని నింపేస్తారు అంటున్నారు పరిశోధకులు. మరి పరిష్కారం ఏమిటని అంటే, మనకంటూ ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకోవటమే అంటున్నారు. ఎవరున్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా వున్నా ఈ ప్రపంచం మాత్రం మనతో నడుస్తుంది. ఆ ప్రపంచం ఎలా వుండాలనేది వారివారి ఇష్టాలపై ఆధారపడి వుంటుందని అంటున్నారు వారు.

-రమ ఇరగవరపు