ప్రయత్నమే పెద్ద విజయం

 

‘మార్పు’ అనగానే భయపడతాం. అది ఎప్పుడైనా, ఎలా అయినా, ఎవరినైనా కాస్త ఇబ్బంది పెట్టే పదం. కొత్తగా స్కూల్లో వేసిన కుర్రాడు భోరుభోరున ఏడుస్తూ స్కూలుకి వెళ్ళనని మారాం చేస్తుంటాడు. ఇంటిని, అమ్మని వదిలి కొత్త చోటుకి వెళ్ళటం అంటే వాడికి భయం. ఆ ‘మార్పు’ని ఎలా ఎదుర్కోవాలో ఆ చిన్న బుర్రకి తెలీక పేచీ పెడతాడు. కొన్ని రోజులకి ఆ మార్పుకి అలవాటు పడి, హాయిగా స్కూలుకి ఏ పేచీ లేకుండా వెళ్ళిపోతాడు. కాస్త సమయం పడుతుంది అంతే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ, పెద్దయినా ‘మార్పు’కి భయపడుతూనే వుంటాం.

రొటీన్ జీవితానికి పురోగతి నిల్:-

నిజానికి అలవాటైన పరిస్థితులకు అంటిపెట్టుకున్నంతసేపూ ఎవరి జీవితంలోనూ పురోగతి వుండదు. వాటికి దూరమైనప్పుడు సహజంగానే అనిశ్చితి, అసౌకర్యం ఎదురవుతాయి. అలా ఎదురైన అసౌకర్యం సౌకర్యవంతంగా మారటానికి ‘కొద్దిగా’  సమయం పడుతుంది. అప్పుడే ఎదుగుదల సాధ్యపడుతుంది. ఉదాహరణకి కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఎందరిలోనో వుంటుంది. కానీ, ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఓ ప్రయత్నం చేసే సాహసం కొందరే చేయగలరు. వారు విజేతలుగా జేజేలు అందుకుంటారు కూడా. అందుకే అంటారు ‘ప్రయత్నమే పెద్ద విజయం’ అని.

మనమూ పిల్లలమే:-

మనమందరం కొద్దో గొప్పో స్కూలుకు వెళ్ళనని మారాం చేసే పిల్లాడితో సమానమే. కొత్త పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు ఎదురవుతుంటే భయంతో బిగుసుకుపోతాం. ఒకోసారి అలా కొత్తవాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఏ మార్పుకి ఇష్టపడం కూడా. మన పరిస్థితి పట్ల అసంతృప్తి, మన జీవితం పట్ల నిరాశ వున్నా కూడా, కచ్చితమైన ప్రయత్నం చేస్తే జీవితం మెరుగుపడుతుందని తెలిసి కూడా ఆ దిశగా ప్రయత్నం చేయం. అందుకు రకరకాల కారణాలు చెపుతుంటాం. కానీ, ఒక్కసారి ఆ భయంలోంచి బయటకి రావాలని గట్టిగా అనుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

గిరి గీసుకోకండి:-

ఎవరికివారు తమ శక్తియుక్తులని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. చాలాసార్లు తమ గురించి, తమ శక్తియుక్తుల గురించి సరైన అంచనా వేసుకోలేక చాలామంది గిరిగీసుకుని  ఉండిపోతుంటారు. ఇతరులతో పోల్చుకుని బాదపడుతుంటారు.  అదే ఎలాంటి భేషజాలు లేకుండా తమ గురించి, తమ బలం, బలహీనతల గురించి అంచనా వేసుకోగలిగితే కొత్త ప్రయత్నం చేయడానికి అంతగా భయపడరు. ‘మార్పు’ వారిని వణికించదు.

అందరూ శక్తిమంతులే:-

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే మాట ఒక్కటే. ‘‘ఈ ప్రపంచంలో తక్కువ శక్తి కలవారు ఎవరూ లేరు. తక్కువ శక్తి కలవాళ్ళమని నమ్మేవాళ్ళే ఉన్నారు. అంతే... దాని వల్లనే జీవితంలో ఎక్కడివారు అక్కడే మిగిలిపోతారు’’ ఈమాట ఎంతో నిజం. అలాగే కోరిన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోగల శక్తి అందరికీ ఉంటుందన్నదే వాస్తవం. శక్తి సామర్థ్యాలను ఆశించిన రీతిలో ఎవరైనా పెంపొందించుకోగలరు. ఏదైనా ఇట్టే సాధించగలమననుకునే చిన్నపాటి ధీమాయే ‘మార్పు’ని ధైర్యంగా ఎదుర్కోగల ఆయుధం. ఆ ఆయుధం ఆధారంగా ముందుకు వెళితే అంతా విజయమే.

-రమ ఇరగవరపు

Related Segment News