ఢిల్లీ కూడా గోవిందా!

 

 

 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయాల పరంపర త్వరలో ప్రారంభం కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయకేతనం ఎగరేసే అవకాశాలు నూటికి నూరుశాతం వున్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికలలో ఏం జరగొచ్చన్న అంశం మీద రెండు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో ఒపీనియన్ పోల్ నిర్వహించాయి.

 

ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఓఆర్జీ సంస్థతో కలసి సర్వే జరిపింది. అలాగే ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, నీల్సన్ సంస్థలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఈ రెండు సర్వేల్లోనూ ఢిల్లీలో రాబోయేది బీజేపీ పాలనేనని స్పష్టమైంది. ఈ సర్వేలో ఢిల్లీ ఓటరు మహాశయులు ‘కమలానికి ఓటేయని కరములు కరముల్?.. కాంగ్రెస్‌ని తిట్టని జిహ్వ జిహ్వా?’ అంటూ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపిస్తామని చెప్పేశారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి స్పష్టమైన ఆధిపత్యం లభించే అవకాశం వుందని చెప్పింది. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వే మాత్రం బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే నాలుగు స్థానాలు తక్కువగా వస్తాయని తేల్చింది.



కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం వుంది. రెండు సర్వేలూ ఆమ్ ఆద్మీ పార్టీకి పది స్థానాలు వస్తాయని వెల్లడించడం విశేషం. బీజేపీకి మెజారిటీ కంటే సీట్లు తక్కువ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తప్పని సరి అవుతుంది. ఏది ఏమైనా ఢిల్లీలో పదిహేనేళ్ళ కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలతో తెరపడింది. కేంద్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం వుందన్నదానికి ఢిల్లీ ఫలితాలు నిదర్శనం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



ఢిల్లీలో తమ పార్టీ ఓడిపోయే అవకాశం వుందని డౌటొచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుగురించి ఆలోచిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత హైకమాండ్ మొట్టికాయ వేసిందేమోగానీ, వెంటనే మాట మార్చి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని, ఎవరి సహకారం అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. టోటల్‌గా ఏంటంటే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గోవిందా.. గోవింద!