బొత్సనా.. మజాకా..
posted on Sep 28, 2015 11:46AM
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి గట్టిపోటీ నిచ్చే ప్రతిపక్షపార్టీ వైకాపా పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేని కారణంగా టీడీపీకి ప్రతిపక్ష నేతగా జగన్ గట్టిపోటి ఇవ్వగలరూ అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే అది రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో.. అప్పుడు పరిస్థితులు బాలేక అధికార పార్టీకి రోజుకో తలనొప్పి తయారయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. పార్టీ రోజు రోజుకు బలపడుతుందనే రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈనేపథ్యంలో జగన్ పై అప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదనే అనిపిస్తుంది. దీనికో తోడు పార్టీలో ఉన్న నేతలు కూడా ఏదో నామమాత్రంగా.. ఏదో ఒక పార్టీలో ఉన్నాం కదా అన్న ధోరణిలో ఉన్నారు తప్ప.. పార్టీని బలోపేతం చేసే ఏవిధమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అంతేకాదు మరోవైపు జగన్ పై కూడా పార్టీ నేతలు కొంత వరకూ అసంతృప్తికరంగానే ఉన్నారు. పార్టీలో అంతా తానై ఉండటం.. ఏదో పదవి ఆశించినా అది కాస్త తన సన్నిహితులకు ఇవ్వడంపై చాలా మంది నేతలు ఇప్పటికే జగన్ పై అసంతృప్పితో ఉండి పార్టీ నుండి బయటకు కూడా వచ్చేశారు.
అయితే అందరి పరిస్థితి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి జంప్ చేసిన మాజీ మంత్రి - మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్లిన బొత్స కొద్దిరోజులకే పార్టీలో తన దంటూ మార్క్ వేసుకొని.. తన టాలెంట్ తో జగన్ తర్వాత నెం 2 స్థానాన్ని దక్కించుకున్నాడు. బేసిక్ గా బొత్సకు రాజకీయానుభవం ఎక్కువ.. మంచి వాక్చాతుర్యం ఉంది.. రాజకీయాల్లో ఎత్తుగడలు బాగా తెలుసు. వీటివల్లే ఇప్పుడ బొత్స జగన్ కు కుడి భుజంలా తయారయ్యారు. సాధారణంగా ఏదైనా మీడియా సమావేశంలో మాట్లాడాలంటే దానికి జగన్ పర్మిషన్ తీసుకోవాలి.. అంతేకాదు ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా జగనే చెపుతారు. అలాంటిది బొత్స మాత్రం తానే జగన్ ను సంప్రదించి.. ఈవిషయంపై మాట్లాడితే బావుంటుంది.. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెడదాం మీరేమంటారు అంటూ జగన్ తో ఓకే చెప్పిస్తున్నారంట. దీంతో ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలు బొత్స ధైర్యం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. అందుకే జగన్ కు కూడా బొత్సపై నమ్మకం కలిగి పార్టీ బాధ్యతలు దగ్గరుండి మరీ చూసుకోమని చెప్పారు.
అయితే బొత్స మాత్రం అధికారాలు ఇచ్చారు కదా అని ఎక్కడా అతిగా ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. కేవలం పార్టీ కార్యక్రమాలు.. ప్రతిపక్షపార్టీపై ఎలాంటి ఎత్తుగడలు ఉపయోగించాలి అనే విషయాలు మాత్రమే చూసుకుంటున్నారట. మొత్తానికి బొత్స రాజకీయానుభవం ఏంటో దీనిని బట్టి మనకు అర్ధమైపోతుంది. ఇంత తక్కువ టైంలో అదీ వేరే పార్టీ మారినప్పటికీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే అన్నీ బానే ఉన్నా ఇప్పుడు వైకాపా పార్టీ నేతలు మాత్రం బొత్స పై కుళ్లుకుంటున్నారట. ఇంతకాలం పార్టీలో ఉన్న కూడా తమకు దక్కని ప్రయారిటీ బొత్సకు దక్కిందని తెగ బాధ పడిపోతున్నారట.