రేవంత్ స్కోర్ బోర్డులో మరో మైనస్ మార్క్?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పట్టు మని పదిహేను నెలలు  కూడా కాలేదు.   ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో కొంచెం చాలా ఎక్కువగానే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో అసమ్మతి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. విపక్షాలు సరే సరి  ఆశించిన దాని కంటే ముందే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని  సంబర పడుతున్నాయి. 

మరో వంక కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు  ముందిచ్చిన విలువ ఇవ్వడం లేదు. అందుకు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఒక ప్రహసనంగా మార్చడమే  నిదర్శనంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే  ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోందని అంటున్నారు.  

నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదుల సంస్కృతి  కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రులపై ఫిర్యాదులు, ముఖ్యనాయకుల మధ్య వివాదాలు  కాంగ్రెస్ కల్చర్ లో ఎప్పటినుంచో ఉన్నదే అంటున్నారు.  ఒక విధంగా ముఖ్యమంత్రులు  తోక జాడించకుండా ఉండేందుకు  పక్కలో బల్లెంలా  అసమ్మతిని అధిష్టానమే ప్రోత్సహించే కల్చర్  ఇందిరమ్మ రోజుల నుంచీ ఉందని అంటారు. 

నిజమే  కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి వ్యతిరేకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అంతగా పట్టించుకోని అధిష్టానం,ఇప్పడు కొంచెం సీరియస్ గానే ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా  అధిష్టానం అగ్ర నేతల దర్శనం లభించడం లేదని అంటున్నారు. మరోవంక అధిష్టానం నేతలు, అసమ్మతి నేతలకు పిలిచి మరీ అప్పాయింట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ అన్నిటినీ మించి  కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూముల వివాదం, జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ ని గట్టిగా దెబ్బ తీసిందని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా  ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు  ప్రభుత్వ వాదనలను పూర్తిగా పూర్వ పక్షం చేస్తూ చేసిన వ్యాఖ్యలు,  ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ అధిష్టానాన్ని మరింత అలర్ట్ చేసిందని అంటున్నారు. కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూముల వివాదం రాజకీయమ రంగు పులుముకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సమస్యను సీరియస్ గా  తీసుకోవడమే కాకుండా, పరిష్కా రాన్నితన చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.  

అయితే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ,మీడియాలో జరుతున్న ప్రచారం మొత్తం ఫేక్ అనే భావనలోనే ఉన్నారు. ఏఐ ద్వారా కొందరు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలను సృష్టించి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని  ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇస్తున్న వివరణ ఆధారంగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మీడియా మీద కత్తులు దూస్తున్నారు. శనివారం (ఏప్రిల్ 5)  కంచ గచ్చిబౌలి వివాదంపై అధికారులతో నిర్వహించిన  సమీక్ష లోనూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్‌ కంటెంట్‌ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

మరో వంక  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కంచ గచ్చిబౌలి భూముల వివాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ ని దెబ్బ తీసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన టీపీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో శనివారం (ఏప్రిల్ 5) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా  అటవీ భూమి అవునా కాదా, గతంలో ఎమి జరిగింది వంటి సాంకేతిక అంశాల జోలికి వెళ్ళకుండా విద్యార్థుల ఆందోళనలు, భూములు చదును చేసే క్రమంలో నెమళ్లు. జింకలు ఇబ్బందికి గురైనట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మంత్రుల కమిటీని మీనాక్షి నటరాజన్‌  ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  

అలాగే  మంత్రులతో భేటీ అనంతరం ఎన్‌ఎఎస్ యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలతో గాంధీభవన్‌లో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె  కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని ఎవరికీ నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్‌ అధిష్టానం  ఆలోచనని స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ కోణంలో చూస్తుంటే, ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ధోరణి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్  మరి కొందరు నాయకులూ, సంస్థలతోనూ చర్చలు జరిపిన తర్వాత  అధిష్టానానికి నివేదిక ఇస్తారని  ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటయని అంటున్నారు. ఈ నేపధ్యంలో  కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎక్కడి వరకు వెళుతుంది? చివరకు ఏమి జరుగుతుంది? అధిష్టానం తీసుకునే నిర్ణయం  రాజకీయంగా ఎలాంటి విపరిణామాలకు దారి   చూపుతుంది?  ఎలాంటి ‘మార్పు’ తెస్తుంది? అన్నవన్నీ శేష ప్రశ్నలు. అయితే చివరకు ఏమి జరిగినా, ఏమీ జరగక పోయినా  అధిష్టానం దృష్టిలో  ముఖ్యమంత్రి స్కోర్ బోర్డులో ఇది మరో మైనస్ మార్క్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భాస్తున్నాయి.