సీపీఎం కమిటీల్లో కొత్త రక్తం
posted on Apr 8, 2025 7:28AM

తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం
పోలిట్ బ్యూరోలోయువకుడు అరుణ్ కుమార్ కు స్థానం
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24 వ జాతీయ మహాసభ లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. కొత్తగా పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ లో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ ఆవిర్భావ సమయంలో అత్యున్నత కమిటీ పోలిట్ బ్యూరోలో పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్యలు సభ్యులుగా కొనసాగారు.. ఆ తరువాత బీవీ రాఘవులు ఎంపికయ్యారు.. తాజాగా మధురై మహాసభలో యువకుడు అరుణ్ కుమార్ కు స్థానం కల్పించారు.
దీంతో సుందరయ్య, బసపున్నయ్యల తర్వాత ఇద్దరు తెలుగు వాళ్లు పోలిట్ బ్యూరో కు ఎంపికయ్యారు. కేంద్ర కమిటీ లో కూడా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తవారికి స్థానం కల్పించారు. సహజంగా ఆ పార్టీ కేంద్ర కమిటీలో చోటు దక్కాలంటే ఐదు పదులు దాటాల్సిందే. గత కొంత కాలంగా యువకులకు ఉన్నత కమిటీల్లో చోటు కలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధురైలో జరిగిన మహాసభలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి కొత్తగా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎం. సాయిబాబా, టి.జ్యోతి, ఆంధ్రప్రదేశ్ నుంచి డి.రమాదేవి కి చోటు కల్పించారు. తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు, పుణ్యవతి, అరుణ్ కుమార్, ఎస్. వీరయ్య, వి. శ్రీనివాస్ రావులు ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఆ తరువాత జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అరుణ్ కుమార్ విశాఖపట్టణంలో జరిగిన జాతీయ మహాసభల్లో తొలుత కేంద్రకమిటీకి ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన మహాసభలో పూర్తి స్థాయిలో కేంద్ర కమిటీ సభ్యునిగా తీసుకున్నారు. ప్రస్తుతం మధురై లో జరిగిన మహాసభలో అరుణ్ కుమార్ ను అత్యున్నత కమిటీ పోలిట్ బ్యూరో లోకి తీసుకోవడం గమనార్హం. అరుణ్ కుమార్ తల్లి హేమలత కూడా కేంద్ర కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు..