ట్రంప్ షాక్‌తో యాపిల్ అలెర్ట్

భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధించకముందే, దిగ్గజ సంస్థ యాపిల్‌ ముందు జాగ్రత్త పడింది. భారత్‌ నుంచి 3 రోజుల్లోనే, 5 సరకు రవాణా విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను తరలించినట్లు సమాచారం. తమ ఉత్పత్తులపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తున్నందున, ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు నుంచీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. భారత్‌లో తయారు చేయిస్తున్న ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు తీసుకెళ్లినప్పుడు, అదనపు సుంకాలు పడితే, ఆ మేర ధర పెంచాల్సి వస్తుంది. సుంకాలు అమల్లోకి రాకముందే, వీటిని పట్టుకెళ్తే,  కొంతకాలం అయినా ధరలు పెంచకుండా, ప్రస్తుత ధరలకే విక్రయించొచ్చనేది యాపిల్‌ ప్రణాళిక. ఇదే విధంగా రత్నాభరణాల రంగం కూడా ముందస్తుగా ఎగుమతులు భారీగా పెంచింది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో మన దేశ సేవలు-వస్తువుల ఎగుమతుల బిల్లు సుమారు రూ.6.84 లక్షల కోట్లను మించొచ్చని అంచనా వేస్తున్నారు. 

అమెరికా, చైనాల మధ్య వివాదం నేపథ్యంలో.. అమెరికా సంస్థ అయిన యాపిల్, మన దేశంలో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ,అసెంబ్లింగ్‌ చేయిస్తోంది. ఇంతకు ముందు మన దేశం నుంచి అమెరికాకు చేసే ఫోన్ల ఎగుమతులపై సుంకాలు ఏమీ లేవు. ఈనెల 5 నుంచి 10% సుంకం అమల్లోకి వచ్చింది. ఈనెల 9 నుంచి ఇది 26% కానుంది. ఆ మేరకు ధర పెంచి, విక్రయించాల్సి వస్తుంది. చైనా నుంచి ఎగుమతి అయితే పన్ను మరింత ఎక్కువ. ఈ నేపథ్యంలోనే మార్చి చివరిలోనే భారత్‌ నుంచి యాపిల్‌ సంస్థ, మూడు రోజుల్లో 5 విమానాల్లో ఐఫోన్లు, ఇతర పరికరాలను ఎగుమతి చేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపినట్లు టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అమెరికాకు ఎగుమతి అవుతున్న 9 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లలో, అధిక వాటా యాపిల్‌దే కావడం గమనార్హం. చైనా నుంచి కూడా ఐ ఫోన్లను భారీగా ఎగుమతి చేసినట్లు సమాచారం.

 ముంబయి నుంచి ఈనెల 1-4 తేదీల్లో అమెరికాకు రత్నాభరణాల ఎగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో 61 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది ఇవి ఆరింతలు అధికంగా 344 మిలియన్‌ డాలర్ల మేర తరలి వెళ్లాయి.