అడవి తల్లి బాటలో గిరిజనులతో మమేకం!
posted on Apr 8, 2025 7:04AM

గిరిజన గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం(ఏప్రిల్ 7) అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండల పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీటీజీ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది.
అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చాపరాయి నుంచి పెదపాడు వరకు 2.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం పెదపాడు గ్రామస్తులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సౌకర్యాలు లేక తాము పడుతున్న ఇబ్బందులపై గ్రామస్తులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు వినతి పత్రం కూడా సమర్పించారు. గ్రామానికి ప్రధాన సమస్య అయిన రహదారి నిర్మాణంతో పాటు చాపరాయి గడ్డ వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వర్షాకాలంలో గడ్డ పొంగితే రెండు, మూడు వారాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాగు నీరు, పాఠశాల భవన నిర్మాణం, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, రచ్చబండ నిర్మాణంతో పాటు లైబ్రరీ, విలేజ్ హెల్త్ క్లినిక్, సెల్ టవర్ నిర్మించాలంటూ వినతిపత్రం సమర్పించారు. పెదపాడు గ్రామస్తులు కోరిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. గ్రామస్తులు కోరిన 12 అభివృద్ధి కార్యక్రమాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు స్పష్టం చేశారు. ఓట్లు వేసినా వేయకపోయినా గిరిజనులకు అండగా నిలబడడం మన బాధ్యత అంటూ అడగగానే నిధులు విడుదల చేశారని చెప్పారు. అంతకు ముందు అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు పెదపాడుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి గిరిజనులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి పెదపాడు మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో గ్రామంలోకి ఆహ్వానించారు.
గ్రామ పర్యటనలో భాగంగా గిరిపుత్రులు తమ ప్రాంతంలో సేంద్రీయ పద్దతిలో పండించే గిరిజన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులతో ముచ్చటించి వారికి పుస్తకాలు, స్వీట్లు పంచారు. అనంతరం గ్రామంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో కలసి మొక్కలు నాటారు.
చాపరాయి గెడ్డలో నడుస్తూ.. సమస్యలు వింటూ.. పెదపాడు నుంచి తిరుగు ప్రయాణంలో పోతంగి గ్రామ పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు కళ్యాణ్ గారిని కలిసి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఇచ్చారు. చంపపట్టి గెడ్డ మీద ఉన్న బ్రిడ్జి హుదూద్ తుపాన్ సమయంలో ధ్వంసం అయ్యిందని, ఇప్పటి వరకు పునర్నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.