తొమ్మిది నెలలలోనే చంద్రబాబుకి దేశ ప్రజల గుర్తింపు

 

ఆమాద్మీ పార్టీ ప్రస్తుతం ఎంత సంక్షోభం ఎదుర్కొంటున్నా ఆ పార్టీ అధినేత మరియు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాపులారిటీ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదు పైగా ఆయనే ఇప్పుడు దేశంలో ‘మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి’ గా గుర్తింపు పొందగలిగారు. ప్రసిద్ద ఇంగ్లీషు పత్రిక ఇండియా టుడే మరియు సిసిరో సంస్థలు రెండూ కలిసి దేశంలో బాగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రులను తెలుసుకొనేందుకు ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ అనే ఒక సర్వే నిర్వహించాయి. అందులో అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా 16 శాతం (డిల్లీలో 55 శాతం) ఓట్లు సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 8 శాతం ఓట్లతో రెండవ స్థానంలో, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్, ఓడిషా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వరుసగా 4,5వ స్థానంలో నిలిచారు.

 

డిల్లీ ఎన్నికలలో జాతీయపార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని ఆమాద్మీ పార్టీకి అఖండమయిన విజయం సాధించిపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ దేశప్రజల దృష్టిని ఆకర్షించడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, మళ్ళీ అధికారం చేప్పట్టిన 9నెలలలోనే దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించగలగడం విశేషం. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అధికారం చెప్పట్టారు. కానీ ఈ తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న విశేష కృషి, తత్ఫలితంగా రాష్ట్రంలో క్రమంగా వస్తున్న మార్పుల కారణంగానే ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారని భావించవచ్చును. ఆయన అనుకొన్నట్లుగా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసి, రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు, మెట్రో రైల్ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి చేసి చూపినట్లయితే దేశంలో ఆయనే నెంబర్ వన్ స్థానం ఆక్రమించినా ఆశ్చర్యం లేదు.