అమరావతి తరలివచ్చేందుకు షరతులు లేవు, కానీ...డిమాండ్స్ ఉన్నాయి

 

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏడాదిన్నర సమయం ఇచ్చినా ఇంకా విజయవాడ తరలివచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకు వారు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అనేక మెలికలు పెడుతున్నారు. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. కానీ విజయవాడ తరలివచ్చెందుకు మాత్రం సముఖంగా లేరు. వారి గొంతెమ్మ కోరికలు విని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈరోజు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, మరి కొందరు ఉద్యోగ సంఘ నేతలు విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన ముందు తమ డిమాండ్ల చిట్టా ఉంచేరు. తమకు హైదరాబాద్, విజయవాడ రెండు చోట్లా కూడా హెచ్.ఆర్.ఏ. చెల్లించాలని, అమరావతిలో ఇళ్ళు కట్టు కొనేందుకు తమకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, ఉద్యోగుల పీఆర్సీ, లోన్‌, అడ్వాన్సుల జీవోలను వెంటనే విడుదల చేయాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.

 

అందుకు ముఖ్యమంత్రి బదులిస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా ఉద్యోగులు కోరినవన్నీ ఇచ్చేనని ఇంకా కొత్తగా డిమాండ్స్ పెట్టవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి విజయవాడలో, ఉద్యోగులు హైదరాబాద్ లో పనిచేస్తుండటం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కనుక ఉద్యోగులు అందరూ వచ్చే జూన్ నెలలోగా విజయవాడ తరలిరావలసిందేనని స్పష్టం చేసారు. ఉద్యోగులు కూడా కొన్ని త్యాగాలకు సిద్దపడాలని ముఖ్యమంత్రి కోరారు. ఉద్యోగులు తమకు శాశ్విత వసతి కల్పించాలన్న కోరికను కూడా ముఖ్యమంత్రి తిరస్కరించారు. వారికి తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించగలనని హామీ ఇచ్చేరు. పీఆర్సీ, లోన్‌, అడ్వాన్సుల జీవోలపై ఉద్యోగుల అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించారు.

 

అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తాము విజయవాడ తరలివచ్చేందుకు ప్రభుత్వానికి ఎటువంటి షరతులు పెట్టడం లేదని, తమవి గొంతెమ్మ కోరికలు కావని అన్నారు. అమరావతిలో పనిచేసేందుకు కార్యాలయాలు చూపిస్తే జూన్ నాటికల్లా అందరం తరలివస్తామని చెప్పారు.

 

ముఖ్యమంత్రిని ముందు అన్ని డిమాండ్స్ పెట్టి, మళ్ళీ తాము ప్రభుత్వానికి షరతులు విధించలేదని ఉద్యోగుల సంఘాల నేతలు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రాజధాని కోసం రైతులు తమ జీవనోపాధి అయిన పంట భూములను త్యాగం చేయడం చూసిన తరువాత కూడా ఉద్యోగులు చిన్నపాటి త్యాగానికి కూడా సిద్దపడకపోవడం చాలా విచారకరం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికంటే వారికే బాగా తెలుస్తుంది. అయినప్పటికీ రెండు హెచ్.ఆర్.ఏ.లు కావాలని కోరడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు.

 

రాష్ట్ర విభజన సమయంలో విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమాన్ని చూసి వారి పట్ల ప్రజలకు చాలా గౌరవభావం ఏర్పడింది. కానీ వారు ఆ గౌరవం ఇప్పుడు చేజేతులా పోగొట్టుకొంటున్నారు. ఇప్పటికే 16 నెలలుగా వారు హైదరాబాద్ లో ఉంటూ పని చేస్తున్నారు. వాళ్ళు విజయవాడకి తరలిరావడానికి ఇంకా ఎన్ని నెలలు లేదా ఏళ్ళ సమయం కోరుకొంటున్నారో అసలు విజయవాడకు తరలి రావాలనుకొంటున్నారో లేదో స్పష్టంగా చెపితే ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకొంటుంది కదా?