డామేజ్ అవుతున్న బాబు ఇమేజ్
posted on Oct 29, 2015 4:36PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్ధుడైన నాయకుడనడంలో ఎలాంటి సందేహం లేదు, ఆయనకున్న దూరదృష్టి, విజన్, క్లారిటీ ఆంధ్రప్రదేశ్ లో మరే నాయకుడికీ లేవంటే ఆశ్చర్యపోవనసరం లేదు, గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి... ఇప్పుడు నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టిన చంద్రబాబు... రాష్ట్రాభివద్ధి కోసం రాత్రీపగలనకా కష్టపడుతున్నారు, అయితే ఇంతటి సత్తా, విజన్ ఉన్న చంద్రబాబు... తన కింద పనిచేసే టీమ్ లో సరైన వాళ్లను ఎంచుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా మంత్రులు... చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా పనిచేయడం లేదనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి, ఇటీవల జరిగిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలోనూ మంత్రుల పనితీరుపై బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రులు సీరియస్ గా తీసుకోలేదని, చాలామంది అంటీముట్టనట్టుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారట.
మంత్రులనే కాదు చంద్రబాబు ఎంచుకుంటున్న అధికారుల పనితీరు కూడా అలాగే ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, రేషన్ షాపుల్లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన ఈపాస్ విధానం మంచిదే అయినా, దాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు, గంటలతరబడి వేచివున్నా సర్వర్ పనిచేయడం లేదంటూ రేషన్ ఇవ్వకపోవడంతో పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు ఈపాస్ విధానమైతే ప్రవేశపెట్టారు గానీ... అది సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమైన సర్వర్లును మాత్రం ఏర్పాటు చేయలేదని, దాంతో ఆ విధానంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, చివరికి దాని ప్రభావం చంద్రబాబుపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా పడుతోందని అంటున్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు సరైన టీమ్ ను ఎంపిక చేసుకోకపోవడమే కారణమని, కనీసం ఇప్పటికైనా సమర్ధులైనవారిని ఎంచుకోవాలని, లేదంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశముందంటున్నారు.