ఆంధ్రా,తెలంగాణా ప్రభుత్వాలు యుద్ద విరమణ చేసినట్లేనా?

 

రేవంత్ రెడ్డి అరెస్టయినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా చాలా ఆందోళనగా కనిపించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మూడు నాలుగు రోజులుగా మళ్ళీ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మళ్ళీ తన అధికార విధులలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ఆయన ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించిన ఏపీ రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు? తెలంగాణా ప్రభుత్వం వైపు నుండి కూడా విమర్శల జోరు దాదాపు నిలిచిపోయింది.

 

విశాఖ పోలీసులు టీ-న్యూస్, సాక్షి న్యూస్ ఛానల్స్ కి ఇచ్చిన మూడు రోజుల గడువు ఎప్పుడో ముగిసింది. కానీ ఇంతవరకు పోలీసులు కానీ సదరు న్యూస్ చానల్స్ వారు గానీ మళ్ళీ ఆ ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఓటుకి నోటు కేసులో నాల్గవ ముద్దాయిగా పేర్కొనబడ్డ జెరూసలేం మత్తయ్యలను కస్టడీ కోసం ఎసిబి అధికారులు గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. ఆంధ్రా, తెలంగాణా మంత్రులిప్పుడు “చట్టం తనపని తాను చేసుకుపోతుంది...అందులో తాము కలుగజేసుకోమని..” కోరస్ పాడుతున్నారు. ఇదంతా గమనిస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేంద్రం రాజీ కుదిర్చిందా? అనే అనుమానం కలుగుతోంది. కానీ హైదరాబాద్ లో ఎసిబి, విజయవాడలో సి.ఐ.డి. పోలీసులు తమ పని తాము చేసుకుపోతుండటం గమనిస్తే మంత్రులు చెపుతున్నట్లు చట్టం తన పని చేసుకుపోతున్నట్లే ఉంది. కానీ ‘జబ్ మియా బీబీ రాజీ హైతో ఖ్యా కారేగా ఖాజీ’ అన్నట్లు రెండు ప్రభుత్వాలు రాజీపడినట్లయితే ఇక చట్టం ఎంత వరకు పనిచేసుకుపోతుందో అందరికీ తెలుసు.