నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 

నేటి నుండి ఐదు రోజుల పాటు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈసారి విశాఖపట్నంలో ఆంద్ర విశ్వద్యాలయంలో కానీ గీతం విశ్వద్యాలయంల్లో గానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆలోచించినప్పటికీ, భద్రత ఇతర కారణాలరీత్యా హైదరాబాద్ లోనే నిర్వహించబోతున్నారు. ఈసారి కేవలం ఐదు రోజులే సమావేశాలు నిర్వహించబోతున్నా అవి సజావుగా సాగే అవకాశం లేదని ముందే స్పష్టమయిన సంకేతాలు కనబడుతున్నాయి.

 

మొదటి రోజునే ప్రత్యేక హోదాపై నోటీసు ఇచ్చి దానిపై సభలో తీర్మానం చేసి ఆమోదింపజేయాలని వైకాపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెదేపా దానిని వ్యతిరేకిస్తే వైకాపా సభను స్తంభింపజేయవచ్చును. కానీ వైకాపా ప్రతిపాదనను తిరస్కరిస్తే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తెదేపా కోరుకోవట్లేదు, ప్రయత్నించడం లేదు,’ అని వైకాపా చేస్తున్న వాదనలకు బలం చేకూరినట్లే అవుతుంది. పైగా తాము దాని కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదిస్తే దానిని కూడా తెదేపా అడ్డుకొందని వైకాపా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుక వైకాపాకి ఆ అవకాశం ఇవ్వకుండా తెదేపాయే ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రతిపాదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అప్పుడు వైకాపా రాజదాని భూసేకరణ, ఇసుక అక్రమ రవాణా వంటి వేరే ఇతర అంశాలు లేవనెత్తి అధికార పార్టీని నిలదీయవచ్చును. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఈ అసెంబ్లీ సమావేశాలను కనీసం 15రోజులు నిర్వహించాలని వైకాపా కోరబోతోంది. ఆ ప్రతిపాదనను తెదేపా నిరాకరించడం ఖాయం కనుక, దానిపై కూడా సభలో రభస జరిగే అవకాశం ఉంది. కొద్ది సేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికార పార్టీ సభ్యలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ (వైకాపా) సభ్యులు అసెంబ్లీ సమావేశాలకి బయలుదేరారు. మరికొద్ది సేపటిలో సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపం తెలిపిన తరువాత సభా కార్యక్రమాలు మొదలవుతాయి.