ఏపీ కోసం బీజేపీ కొత్త డిమాండ్‌

మారాం చేస్తున్న పిల్ల‌ల్ని ఆద‌మ‌ర్చ‌టానికి కొన్ని ట్రిక్కులు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. చాక్లెట్ కావాల‌ని గోల పెడితే.. దాన్ని మ‌ర్చిపోవ‌టానికి మ‌రేదో ఆశ చూపించ‌ట‌మో.. మ‌రో విష‌యం గురించి మాట్లాడ‌ట‌మో చేస్తుంటారు. తాజాగా..అలాంటి ప‌నినే చే్స్తున్నారు ఏపీ బీజేపీ నేత‌లు. ఓ ప‌క్క ఏపీకి ప్ర‌త్యేక హామీ ఇస్తామ‌న్న త‌మ అగ్ర‌నేత‌ల హామీ గురించి ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌ని ఏపీ క‌మ‌ల‌నాథులు.. ప్ర‌తి ఎంపీ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చాల‌న్న స‌రికొత్త డిమాండ్‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

 

మ‌రింత అభివృద్ధి కోసం.. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ కోసం జిల్లాల పెంపు అనివార్య‌మ‌న్న‌ది వారి మాట‌. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో జ‌రిగిన ఏపీ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశానికి హాజ‌రైన ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు మాట్లాడుతూ..ఈ స‌రికొత్త డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు.

 

హ‌రిబాబు లెక్క‌న చూస్తే.. ఏపీలో 25 జిల్లాలు ఉండాల‌న్న మాట‌. ఆచ‌ర‌ణ‌లో ఇదెంత సాధ్య‌మ‌న్న‌ది ఒక పెద్ద ప్ర‌శ్న‌. అయినా.. ఇప్ప‌టికే 13 జిల్లాల్ని మ‌రో ప‌న్నెండు జిల్లాలుగా మార్చ‌టం వ‌ల్ల.. మ‌రింత ఖ‌ర్చు పెర‌గ‌టంతోపాటు.. కీల‌క‌మైన ఐఎస్‌.. ఐపీఎస్ ల కేటాయింపు ద‌గ్గ‌ర నుంచి మ‌రెన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలీదు. కానీ.. అలాంటి అంశాల్ని ప్ర‌స్తావించ‌ని హ‌రిబాబు.. ఏపీని 25 జిల్లాలుగా చేయాల‌న్న డిమాండ్ చేసేశారు.

 

అంతేకాదు.. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా గ‌త ఏడాది కాలంగా కేంద్రం.. ఏపీకి చాలానే నిధులు ఇచ్చేసింద‌ని చెప్పుకొచ్చారు. ఏపీ ద‌శ‌.. దిశ‌ను మార్చే ప్ర‌త్యేక ప్యాకేజీ కానీ.. రాజ‌ధాని నిర్మాణానికి నిధుల హామీ కానీ..ప్ర‌త్యేక హోదా గురించి కానీ ఒక్క మాట మాట్లాడ‌ని హ‌రిబాబు.. అందుకు భిన్నంగా జిల్లాల పెంపు గురించి మాత్రం మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. అవ‌స‌ర‌మైన వాటి కంటే కూడా త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా హ‌రిబాబు మాట‌లున్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.