ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా?
posted on Jan 28, 2015 3:27PM
.jpg)
గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వంలో మళ్ళీ చేతులు కలుపుకొన్న ఆంధ్ర, తెలంగాణా తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇకపై చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనే సూచనకు అంగీకరించారు. ముందుగా వివిధ శాఖల ముఖ్యకార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిపి, అవసరమయితే ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకొనేందుకు అంగీకరించారు. ఇది రెండు రాష్ట్రాలకు కూడా చాలా శుభ పరిణామమే.
కానీ వచ్చే నెలలో చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తారని ప్రకటించిన నాటి నుండి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. చంద్రబాబు తెలంగాణాలో పర్యటిస్తే ఆయనను తప్పకుండా అడ్డుకొని తీరుతామని మంత్రి మహేంద్ర రెడ్డి కుండ బ్రద్దలు కొట్టారు. దైర్యం ఉంటే అడ్డుకోమని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతి సవాలు విసిరారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా తెదేపా కార్యకర్తలు తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేప్పట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని తెదేపా నేతలు భావిస్తుంటే, ఆలోగా ఆ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టేయాలని తెరాస ప్రయత్నిస్తోంది.
ఇక నారా లోకేష్ అప్పుడప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్వీట్ బాణాలు సంధిస్తూనే ఉన్నారు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రధాన సూత్రధారి అయిన నారా లోకేష్ ఇప్పుడు తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన కూడా తన తండ్రి వెంట వరంగల్ పర్యటనకు బయలుదేరాలని భావిస్తున్నారు. కానీ వారిరువురినీ తెలంగాణాలో అడుగుపెట్టడానికి అనుమతించమని తెరాస నేతలు శపధాలు చేస్తున్నారు.
ఈ నేపద్యంలో ముఖ్యమంత్రులు ఇరువురూ చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమేనా? అని ఆలోచిస్తే కాదనే సమాధానం వస్తుంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరింపబడాలంటే ముందుగా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య అవసరమని స్పష్టం అవుతోంది. మరి సయోధ్య కుదురుతుందా? అంటే దానికీ కుదరదనే సమాధానం వస్తుంది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కూడా శాస్వితమేనని భావించవలసి ఉంటుంది.
అందుకు కనిపిస్తున్న ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే మళ్ళీ తెదేపా, తెరాస పార్టీలు పొత్తులు పెట్టుకోవడమే. దాని వలన ఇరువురిలో ఒకరిపట్ల మరొకరికున్న అభద్రతా భావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది కనుక రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కరింపబ అవకాశం ఉంటుంది.