జమ్మూ కాశ్మీరులో బీజేపీ అధికారంలోకి వస్తుందా?
posted on Nov 26, 2014 11:48AM
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిన్న జరిగిన మొదటి దశ ఎన్నికలలో 71.3శాతం పోలింగ్ నమోదు అయింది. అందుకు ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో చేసిన ఎన్నికల ప్రచారమేనని ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. మోడీ కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందని ఎందుకు చెప్పవచ్చునంటే గత ఎన్నికలలో ఆయన ప్రభావం లేనప్పుడు కేవలం 65 శాతమే నమోదు అయింది కనుక. మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరగడం నిజమనుకొంటే, ప్రజలు బీజేపీకే ఓటువేసి ఉండవచ్చును కనుక ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని భావించవచ్చును.
అయితే కేవలం మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పడం కూడా సరికాదు. ఎవరయినా పోలింగ్ కి అంతరాయం కలిగిస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఎన్నికల కమీషన్ చాలా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిందని కాశ్మీరీ వేర్పాటువాదులే స్వయంగా అంగీకరించడం గమనిస్తే, ఎన్నికల కమీషన్ చేసిన ప్రయత్నాలు కూడా పోలింగ్ పెరిగేందుకు దోహదపడ్డాయని భావించవచ్చును. మొదటి దశ ఎన్నికలలో మారు మూల గ్రామాల నుండి ప్రజలను పోలింగ్ బూతులకు తరలించేందుకు ఏకంగా 43 హెలికాఫ్టర్లను వాడటమే అందుకు మంచి నిదర్శనంగా చెప్పవచ్చును. కాశ్మీరీ వేర్పాటు వాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ, భారీగా ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం మరో మంచి ఉదాహరణ. భద్రత దళాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినందునే ఎక్కడా ఎటువంటి ఆవంచనీయమయిన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మొదటి దశ ఎన్నికలు ముగిసాయి.
పోలింగ్ శాతం పెరగడానికి ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో నేటివరకు కూడా అశాంతి నెలకొని ఉంది. అందుకు రాష్ట్రాన్ని పాలించిన ఫరూక్ అబ్దుల్లా, అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా, వారితో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలనే నిందించవలసి ఉంటుంది. వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచి వేయవలసిన ప్రభుత్వాలు వారితో చర్చలు చేయడంతో వారు క్రమంగా బలపడ్డారు. వారికి పాకిస్తాన్ తీవ్రవాదులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుండటంతో భూతల స్వర్గమని చెప్పుకోవలసిన జమ్మూ-కాశ్మీరు రాష్ట్రం ఒక భయానక శాశ్విత యుద్దభూమిగా మారిపోయింది. తత్ఫలితంగా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితికి విసిగి వేసారి పోయిన ప్రజలకు బహుశః మోడీ ఒక ఆశాకిరణంగా కనిపించి ఉండవచ్చును. ఆయన చైనా, పాకిస్తాన్ దేశాలతో కటువుగా వ్యవహరిస్తున్న తీరు చూసిన తరువాతనే కాశ్మీరీ ప్రజలలో ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండవచ్చును. అయితే కేవలం ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన్న ప్రజలు బీజేపీకే ఓటేసి ఉంటారని అనుకోవడానికి కూడా లేదు. కానీ ఆ అవకాశాలున్నాయని భావించవచ్చును.
అయితే పెరిగిన ఈ ఓటింగ్ శాతం వలన ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోవచ్చును. ఎందుకంటే ఇటీవల సెప్టెంబర్ నెలలో కాశ్మీరులో వరదలు వచ్చినప్పుడు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో వారిని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున చేప్పటిన సహాయ పునరావాస చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయినా వారు బీజేపీకి పట్టం కట్టే ఆలోచనలో లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న పిడి.పి.కి పట్టం కట్టే అవకాశాలున్నాయి. కానీ ఒకవేళ జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో బీజేపీ కనుక విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇక మోడీకి తిరుగు ఉండదని చెప్పవచ్చును. అదేవిధంగా అక్కడ పరిస్థితులలో చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వెలువడితే గానీ ఎవరు గెలుస్తారో ఊహించలేము కానీ ఇమార్ అబ్దుల్లా ప్రభుత్వం మాత్రం మటుమాయం అవడం తధ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చును.