ప్రాణసఖి కోసం ఆయువు త్యాగం చేసిన రురుడు

 

నైమిశారణ్యం - 6 


-రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం

 

రురుడు - ప్రమద్వర


బ్రహ్మ మానసపుత్రుడయిన "చ్యవనమహర్షి'' సుకన్య వలన కలిగిన కుమారుడు "ప్రమతి''. తపఃశక్తి సంపన్నుడు, బ్రహ్మజ్ఞాని అయిన ప్రమతిని వలచి వరించింది "ఘృతాచి'' అనే అప్సరస. వీరిరువురి ప్రేమఫలమే "రురుడు'' . 
రురుడు, తన తాతగారైన చ్యవన మహర్షి దగ్గర వేదవేదాంగాలు, తండ్రి ప్రమతి దగ్గర ధర్మసూక్ష్మాలు అభ్యసిస్తూ గురుకుల వాసం చేస్తున్నాడు.

ఆ రోజులలో ... "విశ్వావసువు'' అనే గంధర్వుడు, అప్సరతిలకమైన "మేనక'' వలపుల వలలో చిక్కుకుని, కాలం తెలియకుండా కామశాస్త్రాధ్యయనం చేసాడు. వారిరువురి ప్రేమపాఠాలకు సాక్షిగా ఒక కుమార్తె జన్మించింది. అప్పటికి విశ్వావసువుకు, మేనక మీద మొహం తీరిపోయింది. మేనకకూ, విశ్వావసువు మీద రాగం తొలగిపోయింది. అంతే, ఆ పసిబిడ్డను "స్థూలకేశ మహర్షి'' ఆశ్రమ సమీపాన ప్రవహిస్తున్న ఓ నదీ తీరం దగ్గర వదిలేసి 'ఎవరికి వారే, యమునా తీరే ' అన్నట్టు వారి వారి లోకాలకు వెళ్లిపోయారు మేనక, విశ్వావసువులు. 

 


కొంతసేపటికి అదే దారిలో ఆశ్రమానికి వస్తున్న "స్థూలకేశుడు'', అనాథలా రోదిస్తున్న ఆ పసిబిడ్డను చూసాడు. దివ్యదృష్టితో సర్వం గ్రహించాడు. దివ్యతేజస్సుతో అలరారుతున్న ఆ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని, గుండెలకు హత్తుకుని, తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. ఆ బాలికకు జాతకర్మాది క్రియలన్నీ యథావిథిగా జరిపించి, "ప్రమద్వర'' అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. అక్కడ "రురుడు'' బ్రహ్మచర్య దీక్షతో విద్యాభాస్యం చేస్తూ దినదిన ప్రవర్థనుడవుతున్నాడు. ఇక్కడ "ప్రమద్వర'' స్థూలకేషుని శిక్షణలో స్త్రీలకూ ఉపయుక్తమైన సకలవిద్యలు నేర్చుకుంటూ, శుక్లపక్ష చంద్రరేఖలా పెరుగుతోంది. కాలపురుషుని కౌగిలిలో పదహార వసంతాలు కరిగిపోయాయి. 

వికసించిన పద్మదళనయనాలతో, 

కొనతేలిన నాసిక క్రింద నూనూగు మీసాలతో, 

వ్యాయామ పరిశ్రమతో విశాలమైన వక్షంతో, 

ఆజానుబాహువులతో "రురుడు'' 

అపర మన్మథావతారుడై యవ్వనశోభను సంతరించుకుంటే ...


ఇంద్రధనువుల్లాంటి కనుబొమల క్రింద 

చేపల్లా కదలాడే సోగకన్నులతో, 

గులాబీ చెక్కిళ్ళతో, 

పగడాల అధరాలతో, 

పీనోన్నత వయోధరాలతో, 

రాయంచలకే నడకలు నేర్పు విశాల జఘనంతో "ప్రమద్వర'' 

అపర రతీదేవిలా వసంతఋతు శోభను సొంతం చేసుకుంది.


pramad

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒకరోజు "రురుడు'' నిత్యాగ్నిహోత్రానికి కావలసిన సమిధలకోసం ఆశ్రమం వదిలి అరణ్యంలోకి వచ్చాడు. ఆ పుల్ల, ఈ పుల్ల ఏరుకుంటూ వస్తున్నాడు. మరొక ప్రక్కనుంచి కూనిరాగం తీస్తూ, అడవిపూలు కోస్తూ వస్తోంది ప్రమద్వర. ఇరువురి నడుమ తరుగుతున్న దూరం, వారిరువురిని దగ్గరకు చేర్చింది. 

నడక ఆగింది ... పాట ఆగింది ... 

వారి చూపులు కలిసిన శుభవేళ, ఆగని కాలం ఆగింది. 

రురుని చేతిలోని సమిధలు నేలజారాయి. 

ప్రమద్వర చేతిలోని పూలసజ్జ నెల జారడమూ, 

అందులోని పూవులు రురుని పాదాలకు ప్రేమాభిషేకం చెయ్యడం క్షణాల్లో జరిగిపోయింది.

ఇవేమీ వారిరువురికీ తెలియదు. నిజానికి వారిరువుతూ ఈ సృష్టి చైతన్యాన్ని మర్చిపోయి చాలాసేపు అయింది.

ప్రకృతిలోని అందాన్నంతటినీ, ఆమె "రురుని''లో చూస్తోంది. సృష్టిలోని సౌందర్యాన్నంతటినీ, అతను "ప్రమద్వర''లో చూస్తున్నాడు. ఇంతలో ఆమె సఖులు రావడంతో ప్రమద్వర ఏకాగ్రత చెదిరింది. రురుడు వాస్తవ జగత్తులోకి వచ్చాడు. ప్రమద్వర వొంగుని రురుని పాదాలను అభిషేకించిన పుష్పాలను ఒక్కొక్కటీ ఎరుతూ తన సజ్జలో వేస్తోంది. ఆమె చేతివేళ్ళు అతని పాదాలను పలకరిస్తున్నాయి. అతను పరవశిస్తున్నాడు. మనసుదోచిన వలపుల కోమలి, కోమల హస్తస్పర్శ, అతని మనోఫలకంపై తొలిప్రేమ సంతకం చేసింది. ప్రమద్వర పైకి లేచి, మనసును అతనికి అంకితం చేసి, కదలలేక, కదలలేక, భారంగా అడుగులు వేస్తూ సఖులతో వెళ్ళిపోయింది.


ఒక సుందరస్వప్నం కరిగిపోయింది. రురుడు కూడా మనసులేని మనిషిలా భారంగా వెనుదిరిగాడు. ఎందుకంటే, అతని మనస్సెప్పుడో ప్రమద్వర వెనుకే, ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. రురుడు, ఆశ్రమానికి వచ్చాడన్న మాటేగానీ, ఓ ఉలుకులేదు, పలుకులేదు. తిండిలేదు, నిద్రలేదు ... సదా ప్రమద్వర ధ్యానంతో శూన్యంలోకి చూస్తూ కాలం గడుపుతున్నాడు. అక్కడ ప్రమద్వర పరిస్థితి కూడా ఇంతే.  వాస్తవ జగత్తును మర్చిపోయి, భావజగత్తులో విహరించడమే ప్రేమ కాబోలు. 

"మరోసారి ఆ సుందర పురుషుణ్ణి కలిస్తే'' అనుకుంది ప్రమద్వర.

"ఊహు ... తాపసలోకంలో తండ్రికి తలవంపులు తెలేను. పవిత్రపేమకు పరాజయం వుండదంటారు. అదే నిజమైతే ... ఆ సుందర పురుషుని నుంచి నన్నెవరూ వేరు చేయలేరు'' అని మనసును సమాధాన పరచుకుంది ప్రమద్వర. 


తన కుమారుడు నిత్యకర్మానుష్ఠాన్ని, వేదవిద్యను విస్మరించి, వెర్రివానిలా ప్రవర్తించడం సహించలేకపోయాడు ప్రమతి. తన శిష్యులను పిలిచి, 

"రురుని ప్రస్తుతస్థితికి కారణం ఏమిటి?'' అని అడిగారు. వారు ప్రమద్వర విషయాన్ని మొత్తం గురువుకు విన్నవించారు. 


ప్రమద్వర స్వయంగా ఏమీ చెప్పకపోయినా ... ఆమె మనసు పరాధీనమైందని గ్రహించాడు స్థూలకేశుడు. వయసు తొందర పెడుతున్నా, తొందరపడని ఆమె మనోనిశ్చయానికీ ... తన పెంపకానికీ మనసులోనే సంతసించాడు ఆ మహర్షి. ఆమె ప్రణయాన్ని ... పరిణయవేదిక దాక నడిపించాలని సంకల్పించాడు. ఆ సంకల్పబలమే ప్రమతిని ఆయన దగ్గరకు వచ్చేలా చేసింది. వచ్చిన ప్రమతికి స్వాగతమర్యాదలు చేసి, ఉచితాసనం యిచ్చి గౌరవించాడు స్థూలకేశుడు. ఇద్దరూ కొంతసేపు పరస్పర కుశాలాలు ముచ్చటించుకున్నారు. ఆ తరువాత వారిరువురి ప్రసంగం, ప్రమద్వర, రురుల ప్రణయం వైపు మళ్ళింది. అభ్యంతరాలు చెప్పడానికి అవకాశముంటే కదా ...వారిరువురి ప్రేమను తిరస్కరించడానికి.

రురుని అందంతో పందెం వేసే అందం ప్రమద్వరది.

అతడు బ్రహ్మ మానసపుత్ర వంశ సంజాతుడైతే ...

ఆమె దేవ, గంధర్వ వంశ సంజాత...

అందుకే వారిరువురికి వివాహం చెయ్యాలని ఆ మహర్షులిద్దరూ నిర్ణయించుకుని, వివాహముహూర్తాన్ని కూడా నిశ్చయం చేశారు.

ఈ శుభవార్త ప్రమద్వరకు చేరింది. ఇక మనసు ఆగమంటే మాత్రం, వయసు ఆగుతుందా! మనోవేగంతో వయసు ముందుకు పరుగుతీసింది. ఆమె, తమ తొలి సమాగమ స్థలానికి చేరుకుంది.

అప్పటికే, అక్కడ ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు రురుడు. ప్రమద్వరను చూడగానే చేతులు చాపి, స్వాగతించాడు. ఇక, ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆమెను ఆపలేదు., ఒక్క, అతని కౌగిలి తప్ప. 

ఓ ప్రణయ  ప్రభంజనంలా ... ఓ వెన్నెల జలపాతంలా ఉరుకుతూ వచ్చి, అతని బాహువుల్లో ఒదిగిపోయింది ప్రమద్వర.

- అది ఆవేశం లేని ఆలింగనం.

- కాంక్షలేని కౌగిలి 

కొన్ని భావాలను అక్షరబద్ధం చెయ్యడం అపచారమే అవుతుంది. 

అందుకే అక్కడ మౌనం, మాటను మూగబోయేలా చేసింది.

ఆ తర్వాత వారిరువురూ ఆ వనసీమలలో విహరించారు.

నదీసైకత తీరాల్లో ఆటలాడారు, పాటలు పాడారు, అల్లరిచేసారు. 

కాలాన్ని వారెంతలా మర్చిపోయారంటే "కళ్యాణ మేళాలు మ్రోగడానికి మరో రెండు రోజులే వ్యవధి వుందని'' ఆమె చెలులు చెప్పేవరకూ వారికీ తెలియకపోవడమే ... అందుకు నిదర్శనం.


ఇక ప్రమద్వర, రురుల వివాహవేడుక రేపనగా ... కళ్యాణమాలలు తానే కూర్చాలనే సంకల్పంతో, అడవిపూల కోసమని చెలికత్తెలతో కలిసి అరణ్యంలోకి వెళ్ళింది ప్రమద్వర. కళ్ళు ప్రకృతిని చూస్తున్నా, చేతులు పుష్పాలు కోస్తున్నా, ఆమె మనోమధువనిలో రురుడు భ్రమరంలా విహరిస్తూ చక్కిలిగింతలు పెడుతూనే వున్నాడు. ఆ స్వప్న జగత్తులో, ఊహల ఊయలలూగుతున్న ప్రమద్వర, తన దారికి అడ్డంగా వున్నా ఒక విషసర్పం తోకమీద పాదం మోపడమూ ... ఆ విషసర్పం చివ్వునలేచి, ప్రమద్వర పాదాన్ని కాటువేయడమూ క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.

అతిభయంకరమైన ఆ విషప్రభావం వల్ల, ప్రమద్వర విగత జీవియై నేలపై వాలిపోయింది. కాంచనకాంతులీను ఆమె శరీరవర్ణం కారుమేఘంలా మారిపోయింది. జుట్టు ముడివీడిపోయింది, ఆభరణాలు చెదరిపోయాయి.ఓ సజీవ శిల్పసుందరి నిర్జీవంగా మిగిలిపోయింది.

ఈ విషాద వార్త తెలిసి, ఆమె తండ్రి స్థూలకేశుడు, తక్కిన తాపసులు అక్కడికి చేరారు. అప్పటికే ఆమె చుట్టూ చేరివున్నారు కుశికుడు, ఉద్దాలకుడు, శ్వేతుడు, భరద్వాజుడు, గౌతముడు. అందరి ముఖాల్లోనూ విషాదమే, విచారమే. తన తండ్రి ప్రమతితో కలిసి పరుగు పరుగున అక్కడకు వచ్చాడు రురుడు.

చైతన్యస్రవంతిలా చిందులేసే తన నెచ్చెలి చైతన్యరహితయై, మరణప్రతిమలా పడివుండడం చూసి చలించిపోయాడు రురుడు. మూర్తీభవించిన శోకదేవతలా రురుడు, ఆమె మీద పడి విలపిస్తూంటే ... అతన్ని ఓదార్చేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. అందరూ అశ్రుధారలతో అలా చూస్తూనే వున్నారు.

కన్నీటికి కాలం కరిగి ఒక అడుగు వెనక్కి వేయగలిగితే, ఈ లోకంలో మరణమృదంగం వుండేదేకాదు కదా! 


కాలం చెల్లిన తన ప్రాణసఖిని, అలా చూస్తూ భరించడం తన వల్లకాక, హృదయ విదారకంగా రోదిస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రురుడు. తమ పవిత్రప్రేమకు సాక్షిభూతాలుగా వున్న చెట్లనీ, పుట్టలనీ, వాగులనీ, వంకలనీ చూసి మరింత దీనంగా రోదిస్తూంటే, అవి మౌనంగా తమ సంతాపాన్ని ప్రకటించాయ్ గానీ, రురుని ఓదార్చలేక పోయాయి.


ఎర్రబడ్డ కన్నులతో రురుడు ఆకాశం వంక చూస్తూ ...

"వియోగం చూసి, వినోదించడమే నీ లిఖితమైతే, ఓ విధాతా! నేను ప్రతిఫలాపేక్ష రహితంగా దానధర్మాలు చేసిన వాడినే అయితే, నిష్కామచిత్తంతో తపస్సు చేసినవాడినే అయితే, నిస్వార్థచింతనతో గురుజనులను భక్తిగా ఆరాధించిన వాడినే అయితే ... నా ప్రియురాలు, నా జీవితసర్వస్వం అయిన ప్రమద్వర పునర్జీవితురాలగుగాక. జన్మించినవాడిగా ఇంతవరకు నేను ఇంద్రియ మనోనిగ్రహుడనై, బ్రహ్మచర్య దీక్షతో జప, హోమాదులు, వ్రతాలు ఆచరించినదే సత్యమైతే, నా హృదయేశ్వరి పునర్జీవితురాలై లేచిరావాలి.''

అని రురుడు దుఃఖావేశంతో ప్రశ్నిస్తుంటే ... ప్రకృతిమొత్తం విస్తుబోయి చూస్తోంది. రురుడు, ప్రియా వియోగదుఃఖంతో ఇంకా విలపిస్తూనే వున్నాడు. అప్పుడు ఓ దేవదూత అతని ముందు ప్రత్యక్షమై :

"ధర్మనిష్ఠాగరిష్టా! రురూ! ఇంతవరకూ నువ్వు పలికిన పలుకులు ఎంత సత్యాలో, ఈ లోకంలో మరణం కూడా అంతే సత్యం. ఆయువు తీరిన ప్రాణికి ప్రాణం నిలవదు. అయితే నీ ప్రియురాలు తిరిగి బ్రతకడానికి అవకాశం లేకపోలేదు'' అన్నాడు గంధర్వరాజైన ఆ దేవదూత.

"మహానుభావా! నా ప్రియురాలి కోసం నా ప్రాణాన్నయినా తృణప్రాయంగా ధారబోస్తాను. ఏం చేయాలో చెప్పండి'' అన్నాడు రురుడు.

"నాతో రా! నిన్ను యమధర్మరాజు దగ్గరకు తీసుకువెడతాను. నీ ప్రియురాలిని పునర్జీవితురాలీని చేయగల సమర్థుడు ఆ సమవర్తి ఒక్కడే'' అన్నాడు ఆ దేవదూత.

ఇద్దరూ కలిసి యమలోకం వెళ్ళి యమధర్మరాజును కలిశారు.

 

rurudu

"సూర్యనందనా! యమధర్మరాజా! నీకు తెలియని ధర్మంలేదు. జీవన మాధుర్యాన్ని అందుకోవలసిన శుభతరుణంలో నా ప్రియురాలిని జీవచ్చవంలా చేయడం నీకు ధర్మమా!'' అని కన్నీళ్ళతో యమధర్మరాజును ప్రశ్నించాడు "రురుడు''

"బ్రహ్మచారీ! రురూ! రాగ,ద్వేషాలకు అతీతమైనది నా ధర్మం. కాలం చెల్లినవారు నా నీడలో నడవక తప్పదు. అది పరమేష్ఠి శాసనం. అయినా, ప్రియురాలిని బ్రతికించుకోవాలనే కాంక్షతో, నువ్వు నా దగ్గరకు రావడం నాకెంతో ఆనందం కలిగించింది. నీ ప్రేయసి బ్రతకాలంటే మిగిలిన నీ ఆయుష్షులో సగం ఆమెకు ధారబోయాలి. నువ్వంతటి త్యాగం చెయ్యగలవా?'' అని రురుని నిలదీసాడు యమధర్మరాజు.

రురుడు ప్రత్యుత్తరమీయకుండా, పద్మాసనం వేసుకుని, తన ఆయుర్ధాయంలో సగం ప్రమద్వరకు ధారపోశాడు. రురుని పవిత్రప్రేమకు సంతసించిన యమధర్మరాజు, ప్రమద్వరను పునర్జీవితురాలీని చేసాడు.

అంతవరకూ అచేతనంగా పడివున్న ప్రమద్వర నిద్రలోంచి లేచినట్లు లేచింది. అందరివంక ఆశ్చర్యంగా చూసింది. ఆమె బ్రతకడం అందరికీ ఆనందం కలిగించింది. రురుడు చిరునవ్వుతో ఆమెను సమీపించాడు. ప్రమద్వర సిగ్గులమొగ్గ అయింది.

మహర్షులందరూ వారిరువురికి అనుకున్న ముహూర్తంలో వివాహం చేసారు. ప్రమద్వర, రురుల ప్రణయనౌక సంతోషసాగరంలో, ఆనందపుటలలపై అవిశ్రాంతిగా విహరిస్తూ సాగుతోంది. వీరి జీవితంలో అన్ని రాత్రులు, పున్నమిరాత్రులే. అన్ని క్షణాలూ, శృంగార సంగ్రామ రణక్షేత్రాలే.

 

 


More Purana Patralu - Mythological Stories