పతివ్రతతో అశ్వినీదేవతల పరిహాసాలు

నైమిశారణ్యం - 5 


-రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం


సుకన్య -చ్యవనుడు

 


భృగువునకు పులోమకు జన్మించినవాడు చ్యవనుడు. చ్యవనుడు నిష్కళంక తపఃశ్శాలి. ధర్మనిరతుడు. విద్యాభ్యాసం ముగిసాక నిష్కామ చిత్తంతో తపస్సు ప్రారంభించాడు చ్యవనుడు. అలా ఎంతకాలం తపస్సమాధి స్థితిలో వున్నాడో ఆ కాలానికే తెలియదు. అతని శరీరం కనిపించకుండా చ్యవనునిపై పెద్ద పుట్ట పెరిగింది. చ్యవనుడు ఆ పుట్టలోనే తపస్సు చేస్తున్నాడు. 


ఆ రోజులలో వైవస్వత మనువు కుమారుడైన "శర్యాతి " ధర్మమే పరమావధిగా భావించి రాజ్యపాలన చేస్తున్నాడు.  అతని భార్య "స్థవిష్ఠ". వీరికి కలిగిన కుమార్తె "సుకన్య ". సుకన్య చుక్క. అందాల అపరంజి బొమ్మ. సుగుణాల కొమ్మ. రాయంచ నడకల ముద్దు గుమ్మ. చక్కదనాల చందమామ అయిన సుకన్యకు నవమన్మథుడులాంటి వరునితో పెళ్లి చెయ్యాలని శర్యాతి దంపతులు కలలు కంటున్నారు. 


ఒకనాడు సుకన్య తన చెలికత్తెలు వెంటరాగా, పరివారంతో కలిసి వనవిహారానికి వచ్చింది. అందరూ అచ్చటి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఆటలు ఆడారు. పాటలు పాడారు. వారు అలా ఉల్లాసంగా వనవిహారం చేస్తుండగా సుకన్యకు ఒక పెద్దపుట్ట, ఆ పుట్టలో మినుకు మినుకు మంటూ రెండు జ్యోతులు కనిపించాయి. అవి ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది సుకన్యకు. వెంటనే ఒక అడవి ముల్లు తీసుకుని ఆ జ్యోతులను పొడిచింది సుకన్య. వెంటనే ఆ పుట్ట నుండి బాధాకరమైన ఆర్తనాదం వినబడింది. సుకన్య భయంతో రెండు అడుగలు వెనక్కి వేసింది. కళ్ళ నుంచి రక్తధారలు కారుతుండగా బయటకు వచ్చాడు చ్యవనుడు. ఆయనను చూసి భయంతో పరుగు పరుగున వచ్చి చెలికత్తెలను కలుసుకుంది సుకన్య. 


సుకన్య బాల చేష్టకు అంధుడైన చ్యవనుడు కోపగించుకోలేదు కానీ, ఆమె చేసిన పాప కార్య ఫలితంగా సుకన్య పరివారం అంతా నవరంధ్రాలు పూడుకుపోయి, మల మూత్ర బంధనం జరిగి నరక బాధ అనుభవిస్తున్నారు. తన కుమార్తె చేసిన అకార్యం తెలుసుకున్న శర్యాతి, హుటాహుటిన అరణ్యానికి వచ్చి, సుకన్యను వెంట తీసుకుని చ్యవన మహర్షి పాదాలపై పడి, తన పరివారాన్ని కాపాడమని వేడుకున్నాడు. 


"రాజా, నీ కుమార్తె చేసిన పనికి నేను అంధుడనయ్యాను. నేనిక పరాధీనుడనై బ్రతకాలి. కనుక నీ కుమార్తెనిచ్చి నాకు వివాహంచెయ్యి. శుభం కలుగుతుంది. " అన్నాడు చ్యవనుడు. 
ధర్మాత్ముడైన శర్యాతి, చ్యవనుని కోరిక తీర్చడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. సుగుణవంతురాలైన సుకన్య కూడా చ్యవనుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. ఆ శుభముహుర్తంలోనే, ఆ అరణ్యంలోనే సుకన్యా చ్యవనుల వివాహం వేదోక్తంగా జరిగింది. శర్యాతి పరివారం నవరంధ్ర బంధనం నుంచి విముక్తలయ్యారు. శర్యాతి, సుకన్యకు దాంపత్య ధర్మాలు బోధించి ఆమెను చ్యవన మహర్షిని అప్పగించి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. 


సుకన్య రాజకుమార్తె అయినప్పటికీ, ఆ రాచరికపు అహంకారాలు, దర్పాలు దరికి రానివ్వకుండా, భర్తనే దైవంగా భావిస్తూ చ్యవనుని పరిచర్యలు చేస్తూ ఆదర్శ సతీధర్మాన్ని పాటిస్తోంది.
చ్యవనుడు వార్థక్యంలో ఉన్నవాడు. సుకన్య నవయవ్వన దశలో వుంది. అయినా చిత్తచాపల్యం లేకుండా పతివ్రతా నియమంతో భర్తనే సేవిస్తోంది. ఆమె మనసును పరీక్షించాలనే కోరిక కలిగింది చ్యవనునకు.  నెమ్మది నెమ్మదిగా కుష్టురోగిలా మారాడు. ఒక పక్క అంధుడు. పైగా ముదుసలి. ఇప్పుడు కుష్ఠురోగి. అయినా సుకన్యకు భర్తపై ప్రేమ తగ్గలేదు. అదే ప్రేమాతిశయంతో భర్తకు పరిచర్యలు చేస్తోంది. 


ఒకరోజు సుకన్య తన భర్తకు అన్నం వడ్డించింది. చ్యవనుడు భోజనం చేస్తున్నాడు. సగం భోజనం తిన్న తర్వాత.... కుష్ఠురోగి కావడం చేత అతని చేసి బొటనవేలు ఊడి అన్నంలో పడింది. ఇక భోజనం చెయ్యనన్నాడు చ్యవనుడు. అతను సగం తిని మిగిల్చిన ఆ ఆహారాన్ని భుజించడానికి సిద్ధపడిన సుకన్య, ఆ ఆహారంలో ఉన్న ఆ బొటన వేలును తీసి ప్రక్కన పెట్టి, ఆ ఆహారాన్ని భుజించింది. తన యోగా దృష్టితో అది గ్రహించిన చ్యవనుడు పరమానందభరితుడై సుకన్యను మెచ్చుకుని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. "మీరు నవయవ్వన వుంతులై అపురూపమైన రూపం ధరిస్తే, మీతో  కలిసి సంసార సుఖాలు అనుభవించాలని వుంది. " అని కోరింది సుకన్య. "నీ కోరిక తీరుతుంది. నదీస్నానం చేసిరా " అన్నాడు చ్యవనుడు.

 


సుకన్య నదీస్నానానికి వెళ్లింది. అక్కడ ఆమెకు అశ్వినీదేవతలు ఎదురై "సుందరీ, వృద్ధుడూ, అంధుడూ, కుష్ఠురోగి అయిన ఆ భర్తకుసేవలు చేస్తూ, నీ యవ్వనమంతా ఎందుకు వృథా చేసుకుంటావు. మమ్ము వరించు. నీకు స్వర్గసుఖాలు అందిస్తాము" అన్నారు. వారి మాటలు విన్న సుకన్య భయంతో భర్త దగ్గరకు వచ్చి జరిగింది చెప్పింది. చ్యవనుడు సుకన్యను తీసుకుని వారి దగ్గరకు వచ్చాడు. "పతివ్రతతో ఇలా పరిహాసాలు ఆడవచ్చునా " అనివారిని ప్రశ్నించాడు చ్యవనుడు. "ఈమె అంతటి పతివ్రతయా!  అదెంత వరకూ నిజమో పరీక్షించాల్సినదే. " అని వారు చ్యవనుని వెంట తీసుకుని ముగ్గురూ ఆ నదిలో మునిగి పైకి లేచారు. వెంటనే ముగ్గురూ అద్భుత సౌందర్యవంతులుగా మారి నదిలోంచి బయటకు వచ్చారు. సుకన్య  ఆశ్చర్యంగా చూస్తోంది. 
"సుందరీ, మాలో నీ భర్తను గుర్తిస్తే, నీవు పతివ్రతవని ఒప్పుకుని వెళ్లి పోతాం " అన్నారు అశ్వినీ దేవతలు. సుకన్య తన పాతివ్రత్య మహిమతో చ్యవన మహర్షిని గుర్తించింది. 


సంతసించిన అశ్వినీ దేవతలు సుకన్యను ప్రశంసించి, చ్యవనునికీ ఆ సౌందర్యము, యవ్వనము అలాగే వుంటాయని, కోరుకున్నప్పుడు అతని రూపం అతనికి వస్తుందని వరమిచ్చారు. చ్యవనుడు సంతసించి ఇక నుంచి యజ్ఞులలో సోమపానం చేసే అర్ఙత మీకు కలిగిస్తున్నానని అశ్వినీ దేవతలకు వరమిచ్చాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు, కోపంతో వజ్రాయుధం తీసుకుని చ్యవనుని మీదకు వచ్చాడు. చ్యవనుడు అభిచార హోమం చేశాడు. ఆ హోమగుండం నుంచి "ముందుడు " అనే రాక్షసుడు పుట్టాడు. వాడు ఇంద్రునితో సహా దేవతలందరినీ మింగబోయాడు. ఇంద్రుడు భయపడి చ్యవనుని పాదాల మీద పడి, శరణుకోరి, అశ్వినీ దేవతలకు సోమపానం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

ఆ తర్వాత నవయవ్వనవంతుడైన చ్యవనుడు, తన భార్య అయిన సుకన్యతో కలిసి, తన మామగారు శర్యాతి మహారాజు చేస్తున్న యాగానికి వెళ్లాడు. యవ్వనవంతుడైన యువకునితో కలిసి సుకన్య రావడం చూసి, శర్యాతి తన కుమార్తె శీలాన్ని శంకించాడు. అక్కడ అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై జరిగినదంతా శర్యాతికి వివరించి చెప్పారు. శర్యాతి తన కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించాడు. ఆ యజ్ఞంలోనే చ్యవనుడు తొలిసారిగా అశ్వినీ దేవతలకు యజ్ఞ హావిర్భాగమైన సోమపానాన్ని అందించాడు. అశ్వినీదేవతలు, సుకన్య, చ్యవనులను దీవించి వెళ్లారు. సుకన్య, చ్యవనుల అనురాగ ఫలమే "ప్రమతి".

 


More Purana Patralu - Mythological Stories