స్నేహం పేరుతో ఒక దేవుడు
(Friendship Day Special)
వేదమంత్రాలు చదివేటప్పడు `మిత్ర` అన్న శబ్దం తరచూ వినిపిస్తుంది. మిత్ర అనేది కేవలం ఒక పదం కాదు. మన పూర్వీకులు వైదిక కాలంలో ఏర్పరుచుకున్న ఒక దైవం. `కలిపి ఉంచడం` లేదా `వాగ్దానానికి కట్టుబడి ఉండటం` అన్న సంస్కృత అర్థం నుంచి మిత్ర అన్న పేరు వచ్చింది. నిజంగానే మిత్ర, వరుణదేవునితో కలిసే ఉంటాడు. అందుకనే మనం వినే మంత్రాలలో `వరుణో మిత్ర` అంటూ ఇద్దరినీ ఒకటిగా సంబోధించే మంత్రాలే ఉంటాయి. రుగ్వేద కాలంలో `మిత్ర- వరుణు`లు అత్యంత శక్తిమంతమైన దేవతలు. ఇంద్రుని తరువాత వీరిదే ప్రాధాన్యత. సూర్యుడు ఆకాశంలో కదలాలన్నా, వర్షం కురవాలన్నా, ఆ వర్షపు చినుకులు గడ్డిపరకలకి చేరాలన్నా, నదులు పారాలన్నా, గాలి వీచాలన్నా... మిత్రావరుణులదే బాధ్యత!
తన స్నేహితునితో కలిసి ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించడమే కాదు. అతని వల్ల లోకం పడే ఇబ్బందులని తగ్గిస్తాడట మిత్రడు. ఉదా|| వరుణుడు లోకాన్ని చీకటితో కమ్మేస్తే, మిత్రడు సూర్యోదయాన్ని తీసుకువస్తాడు. అందుకే ఉదయం వేళల్లో పఠించే కొన్ని మంత్రాలలో మిత్ర ప్రసక్తి తప్పక వస్తుంది. తన స్నేహితునికి తోడుగా ఉంటూనే, అతనిలోని చెడుని నిర్మూలించడమే కదా, నేస్తం చేయాల్సిన పని! ఈ బాధ్యలన్నింటికీ తోడుగా వాగ్దానాలకీ, స్నేహానికీ సంబంధించిన విషయాలకు కూడా `మిత్ర` ఓ ప్రత్యేకమైన దైవం.
మనకి చేరువగా ఉండే వ్యక్తిని మిత్రుడు అని సంబోధించడం కూడా ఈ మిత్ర అన్న సంప్రదాయం నుంచే వచ్చిందంటారు. మిత్రావరుణులు కలిసి ప్రకృతిని నడిపించడమే కాదు, ధర్మానికి అనుగుణంగా లోకం నడిచేటట్లు గమనిస్తూ ఉంటారట. ప్రపంచం ఈ నియమం ప్రకారం నడవటానికి వేదాలలో రుతం అన్న పేరు పెట్టారు. మిత్ర జొరాస్ట్రియన్ మతంలో కూడా కనిపిస్తాడు.
కాలం గడుస్తున్న కొద్దీ వరుణుడు కేవలం జలాలకే పరిమితం అయిపోయాడు. రామాయణంలో, రాముడు సముద్రాన్ని దాటి లంకను చేరాలనుకునే సందర్భంలో వరుణుని పాత్ర కనిపిస్తుంది. వరుణునికే ప్రాధాన్యత తగ్గిపోయినప్పడు ఇక మిత్రుని గురించి చెప్పేదేముంది. మిత్ర అన్న పేరుని తరువాత కాలంలో సూర్యునికి ఆపాదించారు. సూర్యునికి ఉన్న నామాలలో `ఓం మిత్రాయనమః` అన్న పేరు తొలి స్థానంలో నిలుస్తుంది. మరి ఈ ప్రపంచానికి వెలుగుని ఇచ్చేవాడే నిజమైన మిత్రడు కదా!
- నిర్జర.
Click here for more Friendship Day Special articles
A True Friendship is good for your Health !