ఆది శంకరాచార్యులు వారిని గూర్చి కొన్ని విషయాలు
భారతదేశ సమైక్యతకు, ధర్మసంస్థాపనకు శంకరభగవత్పాదులు చేసిన కృషి అత్యంత శ్లాఘనీయం. 'బ్రహ్మసత్యం, జగన్నిథ్య, జీవోబ్రహ్మైవనాపరః' అనే అద్వైతసిద్ధాంత సారాన్ని దేశం నలుమూలల ప్రచారం చేస్తూ, మతంపేరిట సాగుతున్న అరాచకాన్ని, అన్యాయాన్ని శాస్తవాదంతో ఖండిస్తూ తన జీవితకాలంలో రెండుసార్లు కాలినడకన దేశపర్యటనగావించిన మహాపురుషుడు.ప్రజలకు మార్గదర్శనం చేయడానికి దేశం నాల్గు దిక్కుల .... తూర్పున - పూరీలో గోవర్ధన పీఠం, దక్షిణాన్న - శృంగేరీలో శారదా పీఠం, పశ్చిమాన్న - ద్వారకా పీఠం, ఉత్తరాన్న - బదరీలో జ్యోతిష్పీఠం ఏర్పరచి జాతిని సంఘటిత పరచిన కార్యశీలి శ్రీశంకరాచార్యులు.
కేవలం పండితలోకానికే పరిమితమైన శాస్త్రచర్చలు, తర్కములు అద్వైతసిద్ధాంత ప్రచారమేకాక, సామాన్యప్రజానీకానికి అందుబాటులో వారివారి ఇష్టదైవాలను మనసారా కొలుచుకొనే విధంగా వివిధ దేవీదేవతలపై స్తోత్రాలు, అష్టకాలు రచించి 'మోక్షసాధనసామగ్ర్యాం భక్తీరేవగరీయసి' అని భక్తికి ప్రాధాన్యమిచ్చిన జగద్గురువు శ్రీశంకరాచార్యులువారు. అవైదికము, అనాగరికము, భయంకరములైన అనేక తాంత్రిక పూజావిధానములను ఖండిస్తూ, ఇహపరసిద్ధికై 'ఆదిత్యమంబికావిష్ణుం గణనాధంచ మహేశ్వరం' అనే పంచాయతన పూజావిధనాన్ని ప్రవేశపెట్టి, షణ్మతస్థాపనాచార్యుడై, వైదిక సాంప్రదాయాన్ని పునరుత్తేజితం చేసిన పరివ్రాజకాచార్యులు శ్రీశంకరులు.
ఒకేజాతి, ఒకేధర్మం పేరిట జాతి జనులను ఏకత్రితంచేసి, కాశ్మీరు నుండి కన్యాకుమారీ వరకు సోమనాధం నుండి గంగాసాగరం వరకు పర్యటించి, జాతీయసమైక్యతకు నిలువెత్తు ప్రతీకగ వెలుగొందిన ధర్మమూర్తి సాక్షాత్ శంకరులు ఆదిశంకరులు.
-Sweta vasuki