చాణూర ముష్టికులు ఎవరు?? వారి వృత్తాంతం ఏంటి!
చాణూర ముష్టికులు కంసరాజుకు నమ్మిన బంటులు. వారు సంసుడి సమావేశంలో కంసుడి వెనుక నిలబడుకుని ఉండగా అక్కడికి బలరామకృష్ణులు వెళ్లారు. చాణూరుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి 'కృష్ణా! నువ్వు చిన్నవాడివని మేమనుకోవడం లేదు. వేయి ఏనుగుల బలంగల కువలయాపీడాన్ని అనాయాసంగా కూల్చివేశావు. నీ శక్తిసామర్థ్యాలను మల్లయుద్ధంలో చూపి మా చక్రవర్తికి ఆనందం కలుగజేయి. 'మా మల్లయుద్ధ విశారదులు నీతో తలపడతారు. బరిలో వారితో పోరాడి మాకు వినోదం కలిగించు' అన్నాడు. కృష్ణుడు సమ్మోహకరంగా నవ్వి 'యోధులూ, యుద్ధ విశారదులూ అక్కర్లేదు. నేను నీతో తలపడతాను. మా అన్న బలరాముడు ముష్టికుడితో తలపడతాడు. ఇష్టమయితే ముందుకు రండి' అన్నాడు.
ఆ మాటలకు చాణూరుడికి రోషం వచ్చింది. మహారాజు సైగతో చాణూర ముష్టికులు రామకృష్ణుల మీదకు దూకారు.
ముష్టికుడు అతి భీకరంగా గర్జించాడు. జబ్బలు చరిచాడు. ఆ ధ్వనికి బెదిరిపోయినట్టు కృష్ణుడు గబగబా బలరాముడి వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. అది చూసి చాణూరుడు పగలబడి నవ్వాడు. 'నవమన్మథమొలకా! యుద్ధమంటే ఆడపిల్లల్నీ, గొల్ల పిల్లల్నీ వెంటేసుకుని బృందావనంలో తిరగడంకాదు. మా జబ్బల చరుపు మీ నారదుడి వీణానాదంలా వుండదు. మా బాహునాదం విని తట్టుకోవడానికి గుండెధైర్యం కావాలి. రా! గొల్లపిల్లడా! ధైర్యముంటే ముందుకు రా' అని హేళన చేశాడు.
మాధవుడు మందగమనంతో ముందుకు వచ్చి నిలిచాడు. తన లీలామానుష స్వరూపాన్ని ప్రదర్శించాడు. శక్తికి ప్రతిరూపంలా చెలరేగాడు. హోరాహోరీగా పోరు సాగింది. మల్లులకు పిడుగు మాదిరిగా, చాణూర ముష్టికులకు అంకుశంలా, కంసరాజుకు మృత్యుదేవతగా, అజ్ఞానులకు అల్పుడుగా, పెద్దలకు తత్త్వస్వరూపుడిగా, కన్నెలకు నవమన్మథుడుగా, యాదవులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిగా నల్లనయ్య గోచరించాడు.
చాణూర ముష్టికులు బలరామకృష్ణుల ధాటికి తట్టుకోలేకపోయారు. శ్రీకృష్ణుడు చాణూరుడ్ని పట్టుకొని గిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు. అతను నెత్తురు కక్కుకుని ప్రాణం వదిలాడు. బలరాముడు ముష్టికుడ్ని పడద్రోసి పాదాలతో తొక్కి చంపాడు. సభలో హాహాకారాలు, హర్షధ్వానాలు, జయజయ నాదాలు చెలరేగాయి. సభలోని మల్లులందరూ బెదిరి తలో దిక్కుకూ చెదిరిపోయారు.
పూర్వం అమరావతీపురంలో ఉతధ్యుడనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. అమిత సౌందర్యమూర్తులు. వారు పెరిగి పెద్దవారయ్యారు కానీ, విద్యాబుద్ధులు మాత్రం అబ్బలేదు. అయినదానికీ, కానిదానికీ అందరితో కయ్యానికి కాలు దువ్వేవారు. బలాధిక్యత మాత్రమే కలిగింది వాళ్ళకు. అది చూసి ఉతధ్యుడు బాధపడి, కొడుకులు భ్రష్టులైనారని భావించి వారికి ధర్మమార్గాన్ని బోధించాలని ఎంతగానో ప్రయత్నించాడు. కాని ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి మాట కొడుకులు ఇసుమంతైనా వినేవారు కాదు. రాక్షసంగా ప్రవర్తించేవారు. ఉతద్యుడు ఒకసారి కోపం పట్టలేక 'మీరు రాక్షసులై పుట్టి, రాక్షససంపర్కం పొంది మల్లవిద్యాప్రదర్శకులుగా చరిస్తారు' అని ఐదుగురు కొడుకుల్నీ తీవ్రంగా శపించాడు.
తండ్రివల్ల ఆ విధంగా శపింపబడ్డ సోదరులే ఆ తరువాత చాణూరుడు, ముష్టికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు అనే అసురులుగా పుట్టి, కంసుని కొలువులో చేరి, చివరికి నల్లనయ్య చేతిలో శాప విముక్తి పొందారు.
◆నిశ్శబ్ద.