అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

శ్రీ నరసింహ క్షేత్రాలు  -  1

 



సత్యజ్ఞాన సుఖ స్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యేస్ధితం
 స్వాంకారూఢ రమా – ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం
త్ర్యక్షం చక్ర పినాక సాభయ కరాన్ బిభ్రాణ మర్కచ్చవిం
ఛత్రీ భూత ఫణీంద్ర మిందు ధవళం లక్ష్మీనృసింహం భజే     

ప్రాచీన కాలంనుంచీ దక్షిణ దేశంలో నరసింహస్వామి ఆరాధన వున్నది.  దీనికి ఆధారం ఈ ప్రాంతాలలో ప్రసిధ్ది  చెందిన నరసింహస్వామి ఆలయాలు.   అంతేకాక అనేక ఆలయాలలో నరసింహస్వామి ఉపాలయాలేకాక దేవాలయ స్తంభాలపైన, గోడలపైన, గోపురాలపైన కనిపించే నరసింహస్వామి శిల్పాలు కూడా.

శ్రీ మహావిష్ణువు నరసింహ రూపాన్ని ధరించి హిరణ్యకశిపునితో యుధ్దం చేసి అతనిని సంహరించాడు.  అందువలన శత్రు సంహారం చేసే ముందు నరసింహస్వామిని ఆరాదించాలని శాస్త్రాలలో చెప్పబడింది.  జీవితంలో కష్టాలు అనంతంగా వున్నప్పుడు, బందిపోటు దొంగలు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, దుష్టగ్రహ నివారణకు నరసింహుని పేరు తలిస్తే ఆ బాధలు తొలగిపోతాయంటారు.  మయమతం అనే వాస్తు శాస్త్ర గ్రంధం నరసింహస్వామిని పర్వతాలమీద, గుహలలో, అడవులలో, శత్రువుల దేశ సరిహద్దులలో ప్రతిష్టించాలని తెలుపుతున్నది.  అందుకేనేమో సాధారణంగా నరసింహస్వామి ఆలయాలు కొండలమీద, గుహలలో వుంటాయి.

తన భక్తులను ఇన్ని విధాల కాపాడే శ్రీ నరసింహస్వామి తెలుగునాట వెలసిన ముఖ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాము.  ముందుగా ఈ నెల  29వ తారీకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం సందర్బంగా అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాము.

క్షేత్ర నామం
అసలీ క్షేత్రానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు తను చేసిన శివాపచార దోషం పోగొట్టుకోవటానికి ఇక్కడ వశిష్ట గోదావరికి, సముద్రానికి మధ్యగల ప్రదేశంలో పార్వతీ నీలకంఠేశ్వరులని స్ధాపించి, రుద్రయాగం చేసి తన పాపంనుండి నిష్కృతి పొందాడు.  నదికీ సముద్రానికీ మధ్య వేదిక నిలిపారుగనుక ఆ ప్రదేశం అంతర్వేది అయింది.  ఈ నీలకంఠేశ్వరుడే ఇక్కడి క్షేత్రపాలకుడు.  ఈయనకి ప్రత్యేక ఆలయం వున్నది.

శ్రీ నరసింహస్వామి ఆవిర్భావము
సప్త మహర్షులలో ఒకరైన వశిష్టుడు గోదావరి నదిలోని ఒక పాయను  ఇక్కడ  సాగర సంగమంగావింపచేసి, ఆ తీరంలోనే ఆశ్రమం నిర్మించుకుని భార్య అరంధతితో సహా తపస్సు చేసుకుంటూ వుండసాగారు.  ఇక్కడ శ్రీ నరసింహస్వామి వెలియటానికి కూడా ఆయనే కారణం.  పూర్వం హిరణ్యాక్షుడి కుమారుడు రక్తలోచనుడు అనే రాక్షసుడుకూడా  ఈ గౌతమీ తీరానే పదివేల సంవత్సరాలు కఠిన తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయి ఏం వరం కావాలో కోరుకొమ్మన్నారు.  రాక్షసులు కోరుకునేదేమున్నదండీ!?  వాళ్ళ ప్రాణాలకి ముప్పులేని వరమేగా!!  ఈ రక్తలోచనుడు కూడా అలాంటి వరమే కోరుకున్నాడు.  యుధ్ద సమయంలో నా దేహంనుంచి పడిన రక్త బిందువులతో ఎంత నేల తడుస్తుందో, ఆ తడిసిన ఇసుక రేణువులకు సమానంగా నాతో సమానులైన వీరులు ఉద్భవించి, యుధ్దం చెయ్యాలి, యుధ్దం తర్వాత అంతా నాలో విలీనమవ్వాలి అని.  భోళా శంకరుడు ఏమంటాడు?  తధాస్తు అన్నాడు.

ఇంక రక్తలోచనుడు మారణకాండ మొదలుపెట్టాడు.  విశ్వామిత్రుడు .. ఆయనకి వశిష్టుడంటే ఏదో కొంచెం కోపం వున్నది.  కేవలం ఆ కోపం తీర్చుకోవటానికేగాక, లోక రక్షణార్ధంకూడా (పూర్వం ఋషులూ, దేవతలూ ఏ పని చేసినా లోక కళ్యాణార్ధమే) విశ్వామిత్రుడు రక్తలోచనుడి దగ్గరకెళ్ళి నీకు బాగా కీర్తి రావాలంటే నువ్వు వశిష్టుడి కుమారులను వధించు అన్నాడు. రక్తలోచనుడు రాక్షసుడు.  అంత ఆలోచన లేదు.  అతను వెళ్ళి వశిష్టుడి శతాధిక సంతానాన్ని చంపేశాడు.  ఆ సమయంలో వశిష్టుడు ఆశ్రమంలో లేడు.  బ్రహ్మలోకానికి వెళ్ళాడు.  అరుంధతీ దేవి ఈ ఘోరాన్ని చూడలేక భర్తని తలుచుకోగా ఆయన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి, ఆశ్రమానికి తిరిగొచ్చి భార్యని ఓదార్చి, నరసింహస్వామిని ప్రార్ధించాడు.   లక్ష్మీదేవితో సహా నరసింహ రూపంలో ప్రత్యక్షమయిన శ్రీహరిని  అనేక విధముల ప్రార్ధించి, రాక్షసుడి వలన జరిగిన కష్టం గురించి చెప్పి రాక్షస సంహారం చేసి భక్తులను కాపాడమని కోరాడు వశిష్టుడు.

శ్రీహరికీ రక్తలోచనుడికీ భయంకరిమైన యుధ్దం జరిగింది.  రక్తలోచనుడి రక్తం కిందబడుతుంటే వర ప్రభావంతో లెక్కపెట్టలేనంతమంది రక్తలోచనులు పుట్టి యుధ్దం చెయ్యసాగారు.  శ్రీహరి ఆ రాక్షసుడి రక్తం కింద పడకుండా తాగటానికి మాయా శక్తిని సృష్టించాడు.  ఈవిడ అశ్వారూఢురాలయి ఆ రాక్షసుడి రక్తం కిందపడకుండా తాగటం మొదలుపెట్టింది.  దానితో రక్తలోచనుడు శ్రీహరి చేతిలో మరణించాడు.  మాయాశక్తి తాను తాగిన రక్కసుల రక్తమంతా యుధ్దానంతరం ఒక ఖాళీ ప్రదేశంలో విడిచి పెట్టింది.  అదే రక్తకుల్యానది అయింది.  దీనిలో స్నానం చేస్తే భూత, ప్రేత, పిశాచాది బాధలు పోతాయని భక్తుల నమ్మకం.  మాయాశక్తి యుధ్దంలో గుఱ్ఱమెక్కి తిరగటంవల్ల ఆవిడని అశ్వారూఢాంబ అనీ, గుఱ్ఱాలక్క అనీ అంటారు.  ఈవిడకీ విడిగా చిన్న ఆలయం వున్నది.

రాక్షస సంహారానంతరం, వశిష్టుడి పూజలందుకున్న నరసింహుడు, వశిష్టుడు తనని లక్ష్మీ సమేతంగా అక్కడ ప్రతిష్టించి పూజించటానికి అనుమతి ఇచ్చాడు.  అంతేకాదు, వశిష్టుడి తీసుకువచ్చి సముద్రంలో సంగమింపచేసిన గోదావరి పాయ ఆయన పేరుమీద వశిష్ట గోదావరిగా పిలువబడుతుందనే వరం ఇచ్చాడు.  స్వామి ప్రతిష్టా మహోత్సవానికి దేవతలంతా తరలి వచ్చారు.  అంటే మొదట్లో ఈ స్వామి వశిష్ట మహర్షిచేత ప్రతిష్టింపబడి, మధ్యలో కొంత అంతరాయమొచ్చినా, అనాదినుంచీ పూజలందుకుంటున్నాడు.

కలియుగారంభం అయేసరికి అప్పుడు నిర్మింపబడిన ఆలయాలు శిధిలమైపోగా,  ఈ ప్రాంతమంతా అడవిలాగా తయారయింది.  కేశవదాసు అనే అతను అక్కడ తన పశువులను మేపుకునేవాడు.  అతని మందలోని ఒక ఆవు రోజూ పాలివ్వకపోవటం గమనించిన కేశవదాసు ఒక రోజు ఆ ఆవు వెనక వెళ్ళి ఆ ఆవు ఒక పొద వెనుక వున్న పుట్టమీద పాలు కురిపించటం చూసి ఆశ్చర్యపోయి వెను దిరిగి వచ్చేశాడు.  ఆ రోజు రాత్రి స్వామి ఆయన కలలో కనబడి తానక్కడ వున్నానని తనని వెలుపలికి తీసి ఆలయం నిర్మించమని ఆదేశం ఇచ్చాడు.  ఊరివారంతా కలిసి పుట్టలో వున్న స్వామి విగ్రహాన్ని బయటకి తీసి గుడి కట్టించి పూజలు చేయసాగారు.  అది కూడా శిధిలం అవటం, తర్వాత భక్తులు మళ్ళీ కట్టించటం జరిగింది. 

చివరికి క్రీ.శ. 1923లో ఊళ్ళోవారికి ఆలయ పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశ్యంతో బెండమూరులంకలో వున్న ఆదినారాయణరావుగారిని కలిశారు.  ఆయన తన ఏడు నౌకలు తిరిగి రాక తన వ్యాపారం ఏ స్ధితిలో వున్నదో తెలియక తానే అయోమయ స్ధితిలో వున్నానని చెప్పారు.  అప్పుడు ఆయన కుమారుడు రంగనాధ రాత్రి తనకి కలలో స్వామి కనబడి ఆలయ నిర్మాణం చెయ్యమన్నారనీ, తమని అన్ని విధాలా కాపాడుతానని చెప్పాడనీ చెప్పాడు.  ఆదినారాయణగారు సంతోషించి తన నౌకలన్నీ ఏ విధమైన నష్టమూ లేకుండా తిరిగి వస్తే స్వామి ఆలయం నిర్మిస్తానని అన్నారు.  ఆయన నౌకలు ఏ నష్టం లేకుండా రావటంతో ఆయన ప్రస్తుతం వున్న ఆలయం నిర్మింపచేశారు.

శ్రీ కూర్మం
కొంతకాలం తర్వాత ఒక బెస్తవాడు రక్తమాల్యానదిలో చేపలు పట్టుకుంటుండగా వలలో ఒక సాలిగ్రామం పడింది.  అతను అదేదో మామూలు రాయి అనుకుని దానిని తీసి నదిలో వేసి తిరిగి వలవేయగా మళ్ళీ అది వలలోకి వచ్చింది.  అలా అతను ఎన్నిసార్లు ఎక్కడ వల వేసినా ఆ రాయి వచ్చి వలలో పడుతుండటంతో అతనికి కోపం వచ్చి ఆ రాయి తీసి నేలకేసి కొట్టాడు.  దానినుంచి రక్తం ఆగకుండా స్రవించటం చూసి భయంతో స్పృహ తప్పాడు.  స్వామి ఆ సమయంలో అతనికి తాను కూర్మావతారుడననీ, తనని ఆలయానికి తీసుకెళ్ళి నరసింహస్వామితోపాటు నిత్యాభిషేకాలు చేయమని చెప్పమని సెలవిచ్చాడు.  ఆ బెస్తవాడు దానిని  ఆలయానికి చేర్చగా అప్పటినుంచీ స్వామి ఆనతి మేరకు నిత్యం శ్రీ నరసింహస్వామితోబాటు శ్రీ కూర్మానికి కూడా అభిషేకాలు జరిపిస్తున్నారు. 

విశేషాలు

సాధారణంగా విష్ణువుకి అభిషేకాలుండవు.  కానీ ఇక్కడ రక్తమాల్యానదిలో దొరికిన శ్రీ కూర్మస్వామి ఆదేశానుసారం, ఆయనకి శాంతి కలగటానికి రోజూ శ్రీ నరసింహస్వామికీ, శ్రీ కూర్మానికీ అభిషేకాలు జరుగుతాయి.  అభిషేక సమయంలో స్వామి దగ్గరవున్న శ్రీకూర్మాన్ని భక్తులు దర్శించవచ్చు.

ఇంకొక విశేషం....అన్నా చెల్లెళ్ళ గట్టు .. సంగమ ప్రదేశంలో దూరాన కనబడుతున్న చిన్న కొండని అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారుట.  దీని కధమాత్రం ఎవరూ చెప్పలేక పోయారు.

అవకాశం వున్నవారు చూడవలసిన ప్రదేశాలు
1.    శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
2.    శ్రీ నీలకంఠేశ్వరుని ఆలయం
3.    గుఱ్ఱాలక్క గుడి
4.    సంగమ ప్రదేశం
5.    చక్ర తీర్ధం (రక్తమాల్యుని వధానంతరం స్వామి తన చక్రాన్ని ఈ కుండంలో కడిగాడనీ, ఇక్కడ స్నానం
చేస్తే విశేష ఫలితాన్నిస్తుందంటారు
     6,  రక్తమాల్యానది



మార్గం
తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకాలో వున్న ఈ గ్రామానికి పాలకొల్లు దాకా రైలు, బస్సులలోనూ, పాలకొల్లునుంచి బస్సులోనూ చేరుకోవచ్చు.
ఆహారం
స్వామివారి ఆలయం వెనుక వున్న భోజన శాలలో మధ్యాహ్నం నిత్యం అన్నదానం వున్నది.  శుభ్రమైన, రుచికరమైన ఈ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు, ఈ సేవ నిరంతరం కొనసాగటానికి తమ శక్తికొద్దీ అన్నదానానికి విరాళమివ్వవచ్చు.
వసతి
టి.టి.డి. వసతి గృహం వున్నది.  ముందుగా రిజర్వు చేయించుకోవాలంటే, ఆలయం ఆఫీసుని సంప్రదించవచ్చు. ఫోన్ నెంబరు   08856 - 259313

- పి.యస్.యమ్. లక్ష్మి




More Vyasalu