Home » Diet and Health » ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో బొప్పాయి, పైనాపిల్ తింటే అబార్షన్ ఎందుకు అవుతుందో తెలుసా!
ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో బొప్పాయి, పైనాపిల్ తింటే అబార్షన్ ఎందుకు అవుతుందో తెలుసా!

గర్భం దాల్చడం అనేది వివాహం అయిన ప్రతి మహిళ కల. తల్లిని కావాలని, మాతృత్వాన్ని ఆస్వాదించాలని మహిళలు ఎన్నో కలలు కంటారు. గర్బం దాల్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మహిళలు గర్బం దాల్చిన తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని చెబుతుంటారు. వాటిలో బొప్పాయి, పైనాపిల్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా గర్బం దాల్చిన మొదటి నెలల్లో పైనాపిల్, బొప్పాయి తినకూడదని, ఒకవేళ అవి తింటే అబార్షన్ లు అవుతాయని చెబుతారు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి వివరంగా తెలుుకుంటే..
బొప్పాయి ఇలా ఉంటే తినకూడదు..
పచ్చిగా లేదా సగం పండిన బొప్పాయి తినడం మంచిది కాదు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్ , పాపైన్ వంటి సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. కొన్ని పరిశోధనలు , ప్రయోగశాల అధ్యయనాలు ఈ సమ్మేళనాలు గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తాయని ఫలితాలు ఇచ్చాయి. ఈ కారణంగా గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి, లేదా సగం పండిన బొప్పాయి ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ సమ్మేళనాలు గర్భాశయ సంకోచాలను పెంచుతాయని చెబుతారు, అందువల్ల, గర్భం దాల్చిన తొలినాళ్లలో పచ్చి బొప్పాయిని తినకుండా ఉండమని సలహా ఇస్తారు. ఈ కారణంగానే పచ్చి లేదా ఆకుపచ్చ బొప్పాయిని గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదని చెబుతారు.
పండిన బొప్పాయి..
పూర్తిగా పండిన బొప్పాయి భిన్నంగా ఉంటుంది. పండిన బొప్పాయిలో పాలు (లేటెక్స్) గణనీయంగా తగ్గి ఉంటాయి , ఇందులో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందువల్ల, గర్భిణీ స్త్రీలు పండిన బొప్పాయిని మితంగా తీసుకోవడం ప్రమాదకరం కాదని కొంతమంది నిపుణులు చెబుతారు. అయితే వీటి గురించి పరిశోధకులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అందుకే పండిన బొప్పాయి అయినా చాలా మితంగా తీసుకోవడం మంచిదని చెబుతారు.
పైనాపిల్..
పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుందనే మాటలు తరచుగా చెబుతుంటారు. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ దీనికి కారణం. ఇది గర్భాశయ ముఖద్వారాన్ని మృదువుగా చేసి, గర్భాశయంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అయితే, మితమైన మోతాదులో పైనాపిల్ తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని అధిక మోతాదులో తీసుకున్నప్పుడు లేదా శరీరం ఇప్పటికే సెన్సిటివ్ గా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయని చెబుతారు.
అందుకే గర్భధారణ తొలినాళ్లలో బొప్పాయి, పైనాపిల్‌లను తినకూడదని, వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెబుతారు. ముఖ్యంగా మహిళలకు గర్బం విషయంలో ప్రమాదాలు ఉన్నా, గతంలో గర్భస్రావం జరిగి ఉన్నా, రక్తస్రావ సమస్యలు ఉన్నా ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించమని డాక్టర్ సలహా ఇస్తారు. ముఖ్యంగా పండ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోమని చెబుతున్నారు.
*రూపశ్రీ.
