Home » Diet and Health » మండే ఎండలో శరీరాన్ని చల్లగా ఉంచే రోజ్ సిరప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేస్కోవచ్చు!
మండే ఎండలో శరీరాన్ని చల్లగా ఉంచే రోజ్ సిరప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేస్కోవచ్చు!

వేసవిలో మండే ఎండ, చెమట అందరినీ అలసిపోయేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో అలసట, నీరసం చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది వివిధ రకాల డ్రింక్స్ తాగడానికి మొగ్గు చూపుతారు. వెంటనే శరీరాన్ని చల్లబరిచి, శరీరానికి ఎనర్జీ ఇచ్చే పానీయాలు తాగాలని అనుకుంటారు. అయితే.. బయట తాగే పానీయాలలో అయినా, ఇంట్లో తయారు చేసుకోవాల్సి వచ్చినా వేసవిలో చాలా మంది రోజ్ సిరప్ ను వాడుతుంటారు. మార్కెట్లో దొరికే రోజ్ సిరప్ తెచ్చి ఇంట్లో వివిధ పానీయాలు తయారు చేసుకోవడం కంటే.. ఇంట్లోనే రోజ్ సిరప్ కూడా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బు కూడా చాలా ఆదా అవుతుంది. ఇంట్లోనే రోజ్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..
రోజ్ సిరప్ తయారీకి కావలసిన పదార్థాలు..
గులాబీ రేకులు.. నాటీ గులాబీ రేకులు 2కప్పులు.. బాగా కడగాలి.
చక్కెర 1.5 కప్పులు
నీరు.. 2 కప్పులు
నిమ్మరసం.. 1టేబుల్ స్పూన్
యాలకుల పొడి.. సవానన కోసం 1/2 స్పూన్
బీట్ రూట్ రసం.. 1 లేదా 2 స్పూన్లు.
రోజ్ సిరప్ తయారీ విధానం..
స్టెప్ 1..
ముందుగా నాటీ గులాబీ రేకులను వాటిపై ఉన్న మురికి, మలినాలు పోయేలా 2-3 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. హైబ్రిడ్ గులాబీల కంటే నాటీ గులాబీలనే ఉపయోగించడం మంచిది., ఎందుకంటే వాటికి మంచి ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది.
ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు పోసి, కడిగిన గులాబీ రేకులను వేయాలి. దీనిని 5-7 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. గులాబీ రంగు నీటిలో పూర్తిగా ఇంకిపోయి, గులాబీ రేకులు లేత తెలుపు రంగులోకి కనిపించినప్పుడు, మంటను ఆపివేయాలి.
మరిగించిన నీటిని స్ట్రైనర్ ద్వారా వడకట్టాలి. గులాబీ సువాసనగల సహజమైన రోజ్ వాటర్ బేస్ సిద్ధమైనట్టే.
స్టెప్ 2..
మరొక లోతైన బాణలిలో 1 కప్పు నీరు, 1.5 కప్పుల చక్కెర వేయాలి. చక్కెర పూర్తిగా కరిగే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. అది కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి. తీగపాకంలా చిక్కబడకుండా చూసుకోవాలి. కేవలం కొద్దిగా జిగురుగా ఉండాలి.
ముందే తయారు చేసుకున్న గులాబీ నీటిని వేడి పాకంలో పోయాలి. సువాసన కోసం యాలకుల పొడిని, ఎరుపు రంగు బాగా కనిపించడం కోసం బీట్‌రూట్ రసాన్ని కూడా కలపాలి అన్నీ బాగా కలవడానికి దీనిని మరో 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
మంట ఆపి పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా అయ్యాక, నిమ్మరసం వేసి బాగా కలపాలి. నిమ్మరసం వేయడం వల్ల చక్కెర స్పటికాలుగా మారకుండా సిరప్ లాగా ఉంటుంది. కాబట్టి నిమ్మరసం తప్పకుండా వేయాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత స్వచ్ఛమైన గులాబీ సిరప్ సిద్ధమైనట్టే. దీనిని ఒక శుభ్రమైన గాజు సీసాలో లేదా జాడీలో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఈ సిరప్ నెలల తరబడి నిల్వ ఉంటుంది.
ఉపయోగించే విధానం..
పైన తయారు చేసుకున్న రోజ్ సిరప్ ను ఫలూదా, లస్సీ, మొహబ్బత్ కా షర్బత్ వంటి పానీయాలలోనే కాకుండా, కేక్ టాపింగ్ డెకరేషన్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు.
*రూపశ్రీ.
