Home » Diet and Health » are you listening to your body

శరీరం ఏమి చెబుతుందో వింటున్నారా?

గమనించాలే కానీ మన చుట్టూ ఉండే ప్రతిదీ ఏదో ఒకటి వ్యక్తం చేస్తూనే ఉంటాయి. నేటి గజిబిజి జీవితంలో మనం ఏవీ పరిశీలనగా చూడం. మన చుట్టూ ఉండే చెట్టు, పుట్టా, వస్తువులు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి.. ఇలా అన్ని ఏదో ఒకటి చెబుతున్నట్టే అనిపిస్తాయి. మరి అన్నీ ఎన్నో చెబుతున్నట్టు అనిపించినప్పుడు మన శరీరం మనతో ఏమీ చెప్పకుండా ఉంటుందా??

శరీరం మాట్లాడుతుందా ఏంటి?? అని ప్రశ్న వేస్తారు చాలామంది. అయితే శరీరానికి కూడా భాష ఉంటుంది, శరీరానికి బాధ ఉన్నట్టే.. ఆ భాష కూడా కొన్ని నిర్ధిష్ట వ్యక్తీకరణలు కలిగి ఉంటుంది. శరీర భాషను అర్థం చేసుకున్నవారు శరీరాన్ని చక్కగా మార్చుకోగలరు. ముఖ్యంగా మహిళల్లో దశల వారిగా శారీరకంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లి, తల్లి కావడం అనేవి శారీరకంగా ఊహించని మార్పులకు కారణం అవుతాయి. ఇలా శారీరకంగా జరుగుతున్న మార్పులతో సమన్వయం అయితే వాటితో కలసి తమను తాము మార్చుకుంటే… కనీసం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే..  నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టు, శరీరం కూడా ఎన్ని దశలు దాటినా వాటికి తగ్గట్టు తాను మారుతూ శరీరాన్ని మాత్రం దృఢంగా.. అందంగా ఉంటుంది.

మార్పు.. చేర్పు..

ఒక మార్పుకు సన్నద్ధం అవడం అంటే చేర్పుకు సిద్ధమవడమే.. ఉదాహరణకు పెళ్ళైన అమ్మాయిలు గర్భవతులయ్యి బిడ్డను మోయడం మొదలుపెట్టాక దానికి తగ్గట్టు ఆహారం నుండి ఎన్నో విషయాలలో మారతారు. కొన్ని ఇష్టాలు దూరం పెడతారు, మరికొన్ని ఇష్టం లేకపోయినా అలవాటు చేసుకుని ఇష్టంగా మార్చుకుంటారు. అయితే అదంతా కడుపులో బిడ్డ మీద ఉన్న ప్రేమతో చేస్తారు. అదే సాధారణంగా డెలివరీ తరువాత లావైతే… ఆ లావు తగ్గకపోతే… చాలా మంది చెప్పేమాట ఏముంది పెళ్ళై బిడ్డ కూడా అయింది. ఈ మాత్రం ఉండరా ఏంటి?? అందరూ ఇలా కామెంట్ చేసేవాళ్లే కానీ ప్రెగ్నెన్సీ, డెలివరీ వల్లే ఇలా అయ్యాను అని ఎవరూ అర్థం చేసుకోరు.. వంటి మాటలు చెబుతారు.

అయితే ఒకరు ఏదో అనుకోవడం, ఆ ఇంకొకరికి సంజాయిషీ చెప్పడం ఇవన్నీ కాదు ముఖ్యం. మన శరీరాన్ని మనం ఎంత ఫిట్ గా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అందుకే చక్కని ఆహారం, తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి అందేలా తీసుకోవాలి. తక్కువ మొత్తాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేవడం, కాసింత యోగా, ధ్యానం, మనసును ఆహ్లాదపరిచే పనులు చేయడం ఇవన్నీ చేస్తుంటే మనసు ఉల్లాసంగా మారి సహజంగానే శరీరం కాస్త తేలికపడిన భావన అనిపిస్తుంది.

ప్రేమించడం..

ప్రేమ చాలా గొప్పది. అది అనిర్వచనీయమైన భావాన్ని వ్యక్తం చేసే గొప్ప మార్గం. అయితే ఎవరో బయటి వాళ్ళను, వస్తువులను, సినిమా తారలను ఇలా వీళ్లను కాకుండా మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. మన శరీరంలో ఎంతో గొప్ప అవయవాలు ఉన్నాయి.

గుండెకు ఏదైనా సమస్య వస్తే అది ఎన్ని లక్షలు పెట్టినా దొరకడం కష్టం

కిడ్నీలు ఫెయిల్ అయితే జీవితానికి అనుక్షణం గండం

ఊపిరితిత్తులు చెడిపోతే ప్రాణం ఆనంతవాయువుల్లో కలిసిపోతాయి

కళ్ళకు  ఏమైనా అయితే ప్రపంచమే చీకటి

వినికిడి లేకపోతే ఎంతో గొప్పవైన శబ్దాలను వినలేక ఎప్పుడూ నిశ్శబ్దలోకంలో ఉండిపోతారు.

ఇలా ఒకటా రెండా… మన శరీరంలో ఎంతో అమూల్యమైన అవయవాలు ఉన్నాయి. మరి ఇంతకంటే గొప్ప వస్తువు ఎక్కడైనా ఉంటుందా?? చేతిలో పట్టుకునే బొడి 20వేల ఫోన్ గురించి ఆలోచించి స్క్రీన్ గార్డ్, బాక్ కవర్ అన్నీ వేయించి జాగ్రత్త పెట్టుకునే మనం శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా.. అందుకే శరీరాన్ని ప్రేమించుకోవాలి. మనల్ని ఈ శరీరం ఎంతో కాలంపాటు మోస్తుంది. ఎప్పటికప్పుడు శరీర అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి. దృఢంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

పాజిటివ్ మైండ్..

పాజిటివ్ మైండ్ అనేది మనిషిని ఎలాంటి పరిస్థితులలో అయినా పర్ఫెక్ట్ గా, బ్యాలెన్స్ గా ఉండేలా చేస్తుంది. ఏది జరిగినా మన మంచికే అనే పెద్దలు చెప్పిన మాట నిజమే.. కొన్ని సంఘటనలు, సందర్భాలు మనకు తెలియకుండా జరుగుతూ.. చెప్పకుండా వస్తుంటాయి. అలాంటి వాటి విషయంలో పాజిటివ్ మైండ్ ఉండటం ఎంతో అవసరం. ఒక పెద్ద గీత పక్కన దాని కంటే పెద్ద గీత గీసి మీదట గీసిన గీతను చిన్నగా చేయచ్చు. అలాగే మనకున్న సమస్యను ఎప్పుడూ మనకంటే సమస్యలు ఎక్కువ ఉన్న వారితో కంపెర్ చేసుకుని మనకే నయం కదా అన్న తృప్తిని మనలోకి ఒంపుకోవాలి. 

మనిషి ఎప్పుడైతే ఏదైనా విషయానికి పాజిటివ్ గా ఉంటాడో అప్పుడు అతని చుట్టూ పాజిటివ్ ప్రపంచం మెల్లగా నిర్మాణమవడం మొదలు పెడుతుంది. ఆ పాజిటివ్ అనేది మనిషికి చెప్పలేనంత శక్తిని అందిస్తుంది. కాబట్టి పాజిటివ్ గా ఉండటం ఎంతో ముఖ్యం. మనం పాజిటివ్ గా ఉంటే మన శరీరం కూడా మనం చెప్పినట్టు వింటుంది. చెప్పినదానికి  స్పందిస్తుంది.

కాబట్టి మనిషి శరీరం ఏమి చెబుతుందో అర్థం చేసుకోవాలి. దానితో సంభాషించాలి, దాన్ని ప్రేమించాలి. అప్పుడు శరీరం కూడా మనకు తగ్గట్టు స్పందిస్తుంది.

                                      ◆నిశ్శబ్ద.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.