Home » Diet and Health » ఈ చిన్న అలవాట్లు.. మహిళల ఆరోగ్యాన్ని అద్బుతంగా మారుస్తాయ్..!

ఈ చిన్న అలవాట్లు.. మహిళల ఆరోగ్యాన్ని అద్బుతంగా మారుస్తాయ్..!

ఇంటి పనులతో, ఉద్యోగ బాధ్యతలతో ప్రతిరోజూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడిపే మహిళల ఆరోగ్యం చాలాసార్లు వెనుకబడిపోతుంది. ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు, పోషకాల లోపాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలు ఎంతగానో సహాయపడతాయి. చిన్నపాటి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుంటే..

ఐరన్ భర్తీకోసం..

మహిళల శరీరంలో ఐరన్ లోపం చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. దీనిని నివారించడానికి మొరింగా అనగా మునిగ ఆకుల పొడితో పాటు ఉసిరి జ్యూస్ కలపిన పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడానికి మునగ ఆకుల పొడి సహాయపడితే, అందులో ఉండే విటమిన్ సి ఆ పోషకాలు శరీరానికి సరిగ్గా అందేలా చూస్తుంది. ఐరన్ మాత్రలతో పనిలేకుండా ఈ సహజసిద్ధమైన కాంబినేషన్ ను క్రమం తప్పకుండా ప్రయత్నించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఎముకల బలానికి..

వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు సాధారణంగా వేధిస్తుంటాయి. వీటికి చక్కటి పరిష్కారంగా రాగి మాల్ట్ ని తీసుకోవచ్చు. రోజూ ఉదయం పూట రాగి మాల్ట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు ఒళ్ళు నొప్పులను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

జీర్ణవ్యవస్థకు..

మన భారతీయ వంటకాల్లో ఎప్పుడూ ఉండే మజ్జిగను చాలామంది కేవలం భోజనం అయ్యాక తాగే పానీయంగా  మాత్రమే చూస్తారు. కొందరైతే పెరుగు తిన్నాం కాబట్టి మజ్జిగతో పనిలేదు అనుకుంటారు.  కానీ మజ్జిగ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. మజ్జిగను మరింత ప్రభావవంతంగా తీసుకునే పద్ధతులను పాటిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.

హార్మోన్ల అసమతుల్యత..

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత అనేది ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. దీనిని అదుపులో ఉంచడానికి ఫ్లాక్స్ సీడ్స్ అనగా అవిసె గింజలు , బాదం పప్పులతో తయారు చేసిన స్మూతీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పానీయం హార్మోన్లను క్రమబద్ధీకరించడమే కాకుండా చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. గుండె ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ పనితీరుకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

పసుపు,మిరియాలు మ్యాజిక్..

రాత్రి పడుకునే ముందు పసుపు, మిరియాలు కలిపిన పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో ఉండే గుణాలు శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే నల్ల మిరియాలు పసుపులోని పోషకాలు శరీరానికి అందేలా సహకరిస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు పసుపు, మిరియాల పాలు   తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది, దీనివల్ల  మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా ఉండవచ్చు.

మహిళలు తమ బిజీ షెడ్యూల్ లో కొద్దిగా సమయం కేటాయించుకుని ఈ సహజ డ్రింక్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించవచ్చు.

                                                                                                                                                *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.