Home » Diet and Health » క్రాష్ డైటింగ్.. చాలామంది మహిళలు చేసే ఈ మిస్టేక్ వల్ల ఎంత ప్రమాదమో తెలుసా.!

క్రాష్ డైటింగ్.. చాలామంది మహిళలు చేసే ఈ మిస్టేక్ వల్ల ఎంత ప్రమాదమో తెలుసా.!

అందంగా, నాజూగ్గా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ ఆలోచన కాస్త ఎక్కువే అని చెప్పాలి. వివాహాలు, పండగలు, లేదా ఏదైనా ప్రత్యేక శుభకార్యాలు దగ్గరపడుతున్నాయంటే చాలు.. ఎలాగైనా సరే కొద్ది రోజుల్లోనే కొన్ని కిలోల బరువు తగ్గిపోవాలని ఆరాటపడుతుంటారు. దీనికి తోడు సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ బాడీ షేప్స్, సెలబ్రిటీల జీవనశైలి, ప్రకటనలు కూడా మహిళలపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. సమాజం నుండి వచ్చే కామెంట్లు, బరువు పెరిగామనే ఆందోళన వారిని త్వరితగతిన ఫలితాలు ఇచ్చే మార్గాల వైపు నడిపిస్తాయి.

ఈ క్రమంలో చాలామంది మహిళలు సరైన అవగాహన లేకుండా గుడ్డిగా ఎంచుకునే మార్గమే క్రాష్ డైటింగ్. ఎలాంటి వ్యాయామం చేయకుండా, కష్టపడకుండా కేవలం కొన్ని రోజుల్లోనే బరువు తగ్గిపోవచ్చనే ఆలోచనతో సోషల్ మీడియా లో కనిపించే రకరకాల డైట్ ప్లాన్లను బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. అయితే, ఈ తొందరపాటు నిర్ణయం శరీరంపై ఎంతటి దారుణమైన ప్రభావం చూపుతుందో చాలామంది గమనించరు.

అసలు ఏమిటీ క్రాష్ డైటింగ్?

క్రాష్ డైటింగ్ అనేది శరీరానికి అవసరమైన కనీస కేలరీలను కూడా అందించకుండా, చాలా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి చేసే ఒక తీవ్రమైన ఆహార నియంత్రణ పద్ధతి. సాధారణంగా ఒక మనిషికి రోజుకు వారి శారీరక శ్రమను బట్టి 1500 నుండి 2000 కేలరీలు అవసరమవుతాయి. కానీ క్రాష్ డైటింగ్ లో రోజుకు కేవలం 500 నుండి 800 కేలరీలు మాత్రమే తీసుకుంటారు. లేదా కొన్ని రకాల ముఖ్యమైన ఆహారాలను అంటే పిండి పదార్థాలు, కొవ్వులు వంటి వాటిని పూర్తిగా మానేస్తారు. కేవలం జ్యూస్ లు మాత్రమే తాగడం, లేదా రోజుకు ఒక్కపూట మాత్రమే తిని కడుపు మార్చుకోవడం వంటివి చేస్తారు.

దీనివల్ల శరీరానికి తక్షణమే కేలరీల కొరత ఏర్పడి, మొదట్లో బరువు వేగంగా తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ తగ్గేది కొవ్వు కాదు, శరీరంలోని నీటి శాతం , కండరాల స్టామినా మాత్రమే.

క్రాష్ డైటింగ్ వల్ల కలిగే తీవ్ర ప్రమాదాలు..

తక్కువ సమయంలో బరువు తగ్గామనే ఆనందం తాత్కాలికమే అయినప్పటికీ, దానివల్ల శరీరానికి జరిగే నష్టం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది. 

క్రాష్ డైటింగ్ వల్ల మహిళలు ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యలు..

జీవక్రియ మందగించడం..

క్రాష్ డైటింగ్ వల్ల శరీరానికి తగినంత ఆహారం అందకపోవడంతో, శరీరం 'స్టార్వేషన్ మోడ్' లోకి వెళ్తుంది. అంటే లభించే కొద్దిపాటి శక్తిని కాపాడుకోవడానికి జీవక్రియ వేగాన్ని బాగా తగ్గించేస్తుంది. దీనివల్ల డైటింగ్ ఆపేసిన వెంటనే, సాధారణ ఆహారం తిన్నా కూడా బరువు చాలా వేగంగా పెరుగుతారు. దీనినే యో-యో ఎఫెక్ట్ అంటారు.

పోషకాహార లోపం..

సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఐరన్, క్యాల్షియం , ప్రొటీన్లు అందవు. దీనివల్ల తీవ్రమైన రక్తహీనత, ఎముకలు బలహీనపడటం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, చర్మం జీవం కోల్పోవడం , గోళ్ళు విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

హార్మోన్ల అసమతుల్యత..

మహిళల ఆరోగ్యం ప్రధానంగా హార్మోన్ల సమతుల్యతపైనే ఆధారపడి ఉంటుంది. అతిగా కడుపు మార్చుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ వంటి ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. దీనివల్ల నెలసరి సరిగా రాకపోవడం, పీరియడ్స్ లో తీవ్రమైన నొప్పులు రావడం , భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మానసిక సమస్యలు , చిరాకు..

ఆహారం సరిగా అందనప్పుడు మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ లభించదు. దీనివల్ల మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం, నిరాశ , ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. కొందరిలో ఇది ఈటింగ్ డిజార్డర్స్ కి కూడా దారితీస్తుంది.

గుండె , అవయవాలపై ఒత్తిడి..

హఠాత్తుగా క్యాలరీలను తగ్గించడం వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావచ్చు. శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు ప్రొటీన్ లోపించి కండరాలు బలహీనపడతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతిని కళ్ళు తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం వంటివి జరుగుతాయి.

నిరంతర అలసట , నీరసం..

రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఓపిక లేకపోవడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం, రోగనిరోధక శక్తి తగ్గి తరచూ వ్యాధుల బారిన పడటం క్రాష్ డైటింగ్ చేసేవారిలో సాధారణంగా కనిపిస్తుంది.

ఆరోగ్యకరమైన మార్గమే శ్రేయస్కరం..

బరువు తగ్గడం అనేది ఒక రోజులోనో, ఒక వారంలోనో అయ్యే ప్రక్రియ కాదు. దానికి సమయం, క్రమశిక్షణ చాలా అవసరం. క్రాష్ డైటింగ్ వలలో పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం కంటే, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం , ఒకటిన్నర లీటర్  నుండి మూడు లీటర్ల నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. బరువు తగ్గడం ముఖ్యం, కానీ ఆరోగ్యంగా బరువు తగ్గడం అంతకంటే ముఖ్యం అని మహిళలు గ్రహించాలి.

*రూపశ్రీ 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.