Home » Diet and Health »  నడుము నొప్పి మహిళలకే ఎక్కువగా ఎందుకు వస్తుంది..దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి.!

నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. అయితే మగవారితో పోలిస్తే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించడం మనం గమనిస్తుంటాము. ప్రతి ఇంటా ఎక్కడో ఒకచోట నడుము నొప్పితో బాధపడే మహిళలు కనిపిస్తూనే ఉంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యవ్వనంలో ఉన్నవారి నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అసలు మహిళల్లోనే ఈ నడుము నొప్పి ఎందుకు ఎక్కువగా వస్తుంది, దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..

శరీర నిర్మాణం , హార్మోన్ల మార్పులు..

మహిళల శరీర నిర్మాణం పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. వారి తుంటి ఎముకల నిర్మాణం , శరీర బ్యాలెన్స్ నడుముపై ఎక్కువ ఒత్తిడి పడేలా చేస్తాయి. దీనికి తోడు మహిళల జీవితంలో జరిగే అనేక హార్మోన్ల మార్పులు నడుము నొప్పికి ప్రధాన కారణమవుతాయి.

నెలసరి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల గర్భాశయం సంకోచించడం, అలాగే శరీరంలో రలాక్సిన్ అనే హార్మోన్ విడుదల కావడం జరుగుతుంది. ఇది తుంటి భాగంలోని కండరాలు , జాయింట్స్ ను  సడలించేలా  చేస్తుంది. దీనివల్ల నెలసరి సమయంలో , ఆ ముందు రోజుల్లో చాలా మందికి తీవ్రమైన నడుము నొప్పి వస్తుంది.

గర్భధారణ , ప్రసవం..

గర్భధారణ కాలంలో మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ శరీర బరువు ముందరకు జరుగుతుంది. దీనివల్ల వెన్నుపాము పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయంలో నడవడానికి, నిలబడటానికి శరీర భంగిమ మారుతుంది. ఇది నడుము కండరాలపై అదనపు భారాన్ని మోపుతుంది.

ప్రసవం తర్వాత కూడా సరైన విశ్రాంతి లేకపోవడం, పాపను ఎత్తుకోవడం, పాలు ఇచ్చేటప్పుడు వంగి కూర్చోవడం వంటి కారణాల వల్ల ఈ నొప్పి దీర్ఘకాలికంగా మారే అవకాశం ఉంటుంది.

ఈస్ట్రోజన్ తగ్గుదల , మెనోపాజ్..

మహిళలకు నలభై ఏళ్ళు దాటిన తర్వాత లేదా మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్థాయిలు వేగంగా తగ్గిపోతాయి. ఈ హార్మోన్ ఎముకల బలానికి ఎంతో అవసరం. ఇది తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఈ పరిస్థితిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నుపూసలు బలహీనపడి, చిన్న చిన్న పనులకు కూడా తీవ్రమైన నడుము నొప్పి వస్తుంది.

లైఫ్‌స్టైల్ ,రోజువారీ అలవాట్లు..

రోజువారీ జీవనశైలి కూడా నడుము నొప్పికి పెద్ద కారణం. మన దేశంలో చాలా మంది మహిళలు ఇంటి పనుల్లో రోజంతా నిరంతరం నిలబడి ఉండటం, భారీ బరువులు ఎత్తడం, వంగి బట్టలు ఉతకడం లేదా ఇల్లు తుడవడం వంటివి చేస్తుంటారు. సరైన పద్ధతిలో కూర్చోకపోవడం లేదా నిలబడకపోవడం వల్ల వెన్నుపాము దెబ్బతింటుంది.

ఆఫీసుల్లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసే ఉద్యోగినుల్లో కూడా కండరాలు పట్టేసి నడుము నొప్పి వస్తుంది. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నడుముకు ఆధారంగా ఉండే పొత్తికడుపు , వెన్ను కండరాలు బలహీనపడతాయి.

పోషకాహార లోపం..

మహిళల్లో విటమిన్ డి , క్యాల్షియం లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టే మహిళలు తమ ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. సరైన క్యాల్షియం అందకపోతే ఎముకల బలం తగ్గుతుంది. అలాగే ఎండలో ఎక్కువ సేపు గడపకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడి ఎముకలు, కండరాల నొప్పులు ఎక్కువవుతాయి.

మానసిక ఒత్తిడి..

శారీరక కారణాలే కాకుండా మానసిక ఒత్తిడి కూడా నడుము నొప్పికి ఒక రహస్య కారణం. ఇల్లు, ఉద్యోగం, పిల్లల బాధ్యతలు ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకునే క్రమంలో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలోని కండరాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా వెన్ను, మెడ భాగాల్లోని కండరాలు ఒత్తిడికి గురై నడుము నొప్పిగా మారతాయి.

ఎత్తు మడమల చెప్పుల వాడకం..

చాలా మంది మహిళలు హై హీల్స్ లేదా ఎత్తు మడమలు ఉన్న చెప్పులు వాడుతుంటారు. ఇవి వేసుకున్నప్పుడు శరీర బ్యాలెన్స్ మారుతుంది. పాదాలపై పడాల్సిన భారం నడుము , వెన్నుపాముపై పడుతుంది. క్రమం తప్పకుండా ఇటువంటి చెప్పులు వాడటం వల్ల వెన్నుపూస అమరిక దెబ్బతిని నడుము నొప్పి వస్తుంది.

స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య సమస్యలు..

కొంతమంది మహిళల్లో పిసిఓడి లేదా పిసిఓఎస్, ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వంటి గర్భాశయ సంబంధిత సమస్యలు ఉంటాయి. వీటి వల్ల కడుపు కింది భాగంలోనే కాకుండా వెనుక నడుము భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తుంది.

పరిష్కారాలు , జాగ్రత్తలు..

నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

రోజూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, ఆకుకూరలు, గుడ్లు, నువ్వులు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట కొంతసేపు లేత ఎండలో గడపడం మంచిది.

రోజూ కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు, యోగా లేదా నడక అలవాటు చేసుకోవాలి. ఇవి నడుము కండరాలను బలంగా మారుస్తాయి.

ఇంటి పనులు చేసేటప్పుడు లేదా ఆఫీసులో కూర్చునేటప్పుడు వెన్నుపాము నిటారుగా ఉండేలా చూసుకోవాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి కాసేపు నడవాలి.

బరువులు ఎత్తేటప్పుడు నడుమును ఎక్కువగా వంచకుండా మోకాళ్లను వంచి బరువులు ఎత్తడం అలవాటు చేసుకోవాలి.

తీవ్రమైన  లేదా ఎక్కువ కాలం  నడుము నొప్పి ఉన్నప్పుడు ఇంట్లో తయారుచేసే కషాయాలు లేదా సొంతంగా పెయిన్ కిల్లర్ బిళ్ళలు వాడకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

                                                                                                                                                *రూపశ్రీ.
 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.